తెలంగాణలో లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇప్పటికే కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తుండడంతో స్కూళ్లు మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో లాక్‌డౌన్ ఉంటుందని, ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందనే భయాందోళన ప్రతి ఒక్కర్నీ వెంటాడుతోంది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా లాక్‌డౌన్‌పై కేసీఆర్ తన ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్‌ను విధించేది లేదని, పరిశ్రమల మూసివేత ఉండదని భరోసా ఇచ్చారు. ఇప్పటికే కరోనాతో లాక్ డౌన్ విధించి చాలా దెబ్బతిన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా నియంత్రణకు పకడ్బంబీ చర్యలు తీసుకుంటున్నామ న్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చని ఆయన తెలిపారు. బాధతోనే విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసినట్టు కేసీఆర్ తెలిపారు.
కరోనా టెస్టుల సంఖ్యను పెంచినట్టు కేసీఆర్ చెప్పుకొచ్చారు. నిన్న ఒక్కరోజే 70 వేలు టెస్టులు చేశామన్నారు. పిల్లల భవిష్య త్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించామన్నారు. అలాగే సినిమా థియేటర్ల యాజమాన్యాలకు కొన్ని వెసులుబాట్లు కల్పించి… కేంద్రం నిబంధనలకు అనుగుణంగా థియేటర్లను ఓపెన్ చేశామన్నారు.