ఆర్టీసీ కార్మికుల్ని కేసీఆర్ విధుల్లోకి తీసుకుంటారా? లేక ఇంతకుముందే చెప్పినట్టు ప్రైవేటుపరం చేయడానికే మొగ్గుచూపుతారా? సగం రూట్లను ప్రైవేటుకు అప్పగించే నిర్ణయం తీసుకుంటారా? లేక సగం మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు చేస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు. వీటన్నింటికీ ఈరోజు సమాధానం దొరికే అవకాశం ఉంది.
ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా ఈరోజు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న ఈ కేబినెట్ మీటింగ్, ఈరోజు-రేపు కూడా జరగబోతోంది. అయితే ఆర్టీసీపై మాత్రం ఈరోజే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇది కీలకమైన అంశం కావడం, పైగా కేంద్రం జోక్యం చేసుకునే ఛాన్స్ ఉండడంతో, ముందుగా ఈ అంశాన్ని తెగ్గొట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
అయితే ఆర్టీసీపై ముఖ్యమంత్రి దూకుడుగా వ్యవహరిస్తారా లేక వరాల జల్లు కురిపిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ గుర్రుగా ఉన్న మాట వాస్తవం. కాకపోతే తన కోపాన్ని మొత్తం కార్మికులపై చూపించకుండా, ఆయన మధ్యేమార్గంగా వెళ్లే అవకాశాలున్నాయి. ఓవైపు కార్మికుల్ని విధుల్లోకి తీసుకుంటూనే, మరోవైపు ప్రైవేటుపరం చేయాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఈ మేరకు చాలామందికి వీఆర్ఎస్ వర్తింపజేయాలని చూస్తున్నారు.
సమ్మె సమయంలో ఆర్టీసీకి వచ్చిన నష్టాన్ని భరించడం, మరణించిన కార్మికుల కుటుంబాల్ని ఆదుకోవడం, డిమాండ్లలో కొన్నింటిపై సానుకూలంగా స్పందించడం లాంటివి కేసీఆర్ చేస్తారని అంతా భావిస్తున్నారు. అయితే ఆర్టీసీలో దాదాపు సగం రూట్లను ప్రైవేటుపరం చేయడం మాత్రం తథ్యం అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. రవాణా చట్టాలు, లేబర్ కోర్టులతో పాటు హైకోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంది. సో.. ఇలాంటి టైమ్ లో కావాలనుకుంటే ఏకపక్షంగా కేసీఆర్ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఆయన ఆర్టీసీ కార్మికుల విషయంలో మధ్యేమార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు.