జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఎలా రూపు దిద్దుకుంటుందో, దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలియదుగానీ, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని, ఢిల్లీ కోటను బద్దలు కొడతానని హుంకరించి ఘీంకరిస్తున్న తెలంగాణా సీఎం కేసీఆర్ జోరుగా అడుగులు వేస్తున్నారు.
ఈసారి ఆయన మాటలకే పరిమితం కాదని చేతల్లో చేవ చూపెడతాడేమో అనిపిస్తోందని అంటున్నారు రాజకీయ నిపుణులు. జాతీయ రాజకీయాల్లో తనకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి, తన కార్యాచరణ సరైన దిశలో ఉండేలా చూడటానికి కేసీఆర్ నేషనల్ పొలిటికల్ వర్కింగ్ కమిటీ అనేదాన్ని ఏర్పాటు చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఇరవైనాలుగుమందితో ఏర్పాటయ్యే ఈ కమిటీలో గులాబీ పార్టీ సీనియర్ నాయకులు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఉంటారు.
వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ చర్చలు జరపడానికి వీరు సహాయపడతారు. అంటే ఏయే అంశాలు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి మొదలైనవన్నీ చెబుతారన్నమాట. కేసీఆర్ వివిధ పార్టీల నాయకులతో ఏ అంశాలు మాట్లాడాలో ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. ఇదిలా ఉంటే కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం నిర్మాణం తలపెట్టిన సంగతి తెలిసిందే కదా. దాని నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు కూడా.
దాని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆఖరునాటికి నిర్మాణం పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారు కేసీఆర్. ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తయ్యాక అక్కడ పార్టీ అధికార ప్రతినిధులను నియమించాలని నిర్ణయించారు. వీరు జాతీయ స్థాయిలో పార్టీ కలాపాలను సమన్వయం చేయడంతోపాటు, జాతీయ మీడియాలో కేసీఆర్ కు, జాతీయ స్థాయిలో ఆయన కార్యకలాపాలకు ప్రచారం కల్పించేలా చూస్తారు.
కేసీఆర్ ఈమధ్యనే ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇక్కడితో ఆయన పొలిటికల్ టూర్లు ఆపేస్తారని తెలుస్తోంది. మార్చిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక మళ్ళీ తన టూర్లు కంటిన్యూ అవుతాయని సమాచారం. ఇది కాకుండా ప్రాంతీయ పార్టీలతో హైదరాబాదులోగానీ, ఢిల్లీలో గానీ సమావేశం నిర్వహిస్తారని అంటున్నారు.
కేంద్ర బడ్జెట్ తరువాత రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమం (ప్రారంభోత్సవాలైనా, శంకుస్థాపనలైనా సరే) కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ పైనా నిప్పులు చెరుగుతున్నారు. దేశాన్ని రక్షించుకోవడానికి తన చివరి రక్తపుబొట్టు కూడా ధారపోస్తానంటున్నారు. కేసీఆర్ ఇప్పటివరకైతే జాతీయ రాజకీయాలపట్ల సీరియస్ గానే ఉన్నట్లు కనబడుతోంది.