అసలు ఈ విలీనాలు చెల్లవు అని అంటున్నాయి గతంలో వచ్చిన కోర్టు తీర్పులు. రెండూ బై మూడోవంతు లెక్కలు ఏవీ విలీనాలకు బలం కాలేవని న్యాయస్థానాలు తేల్చాయి. అయితే రాజ్యాంగంలో, ఫలానా షెడ్యూల్ లోని, ఫలానా పేరాను అనుసరించి.. అంటూ విలీన రాజకీయం ఒకటి సాగుతూ ఉంది. ఇది వరకూ తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి చోద్యాలు చూశారు ప్రజలు.
చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలను బాగానే కొన్నారు కానీ.. ఆయనకు రెండూ బై మూడో వంతు దక్కలేదు. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నట్టుగా ప్రకటించలేకపోయారు. అంతమంది దొరికి ఉంటే చంద్రబాబు కూడా ఆ పని చేసేవారేమో!
అయితే ఇప్పుడు ఆయన పార్టీ రాజ్యసభలో బీజేపీలోకి విలీనం అయిపోయింది. మిగిలిన ఇద్దరు కూడా ఎన్నిరోజులు ఉంటారో చెప్పలేని పరిస్థితి. ఆ సంగతలా ఉంటే.. ఈ విలీనంతో ఫుల్ ఖుష్ అవుతుండవచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎందుకంటే ఆయన కూడా విలీన రాజకీయమే చేస్తూ ఉన్నారు.
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ టీఆర్ఎస్ లోకి విలీనం అయిపోయిందంటున్నారు. ఆ అంశంపై తాము కోర్టుకు వెళ్తామంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా రాజ్యసభలో.. దేశానికే ఎగువసభలో అచ్చం అలాంటి రాజకీయమే జరిగింది కాబట్టి.. సీఎల్పీ విలీనం విషయంలో టీఆర్ఎస్ కు కోర్టులో కూడా ఎదురుండకపోవచ్చు. ఈ విషయంలో కాంగ్రెస్ వాపోవాల్సిందే కానీ, ఇక ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ కూడా మారు మాట్లాడలేకపోవచ్చు.