ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ హోదాలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇక ఢిల్లీ సీఎం పీఠం నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందా? అనేది ఆసక్తిదాయకమైన చర్చ. పంజాబ్ లో ఆప్ సాధించిన సంచలన విజయం తర్వాత.. ఆప్ వేర్వేరు రాష్ట్రాల్లో ఎదుగుదలపై దృష్టి పెట్టినట్టే.
ఈ ప్రయత్నాలను ఆప్ చాన్నాళ్లుగానే చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి గట్టి ఊపు వచ్చింది. మరో రాష్ట్రంలో అధికారాన్ని అంది పుచ్చుకున్న తర్వాత, ఢిల్లీకి, నగర ఓటరుకు మాత్రమే పరిమితం అనుకున్న పార్టీకి కొత్త ఉత్సాహం వస్తోంది.
ఈ క్రమంలో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా కార్యాచరణను ప్రారంభిస్తోంది కూడా. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ల మీద ఆప్ ఇప్పటికే దృష్టి పెట్టింది. హిమాచల్ ప్రదేశ్ లో అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ఆప్ ప్రకటించింది.
ఆ రెండు రాష్ట్రాల్లోనూ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితే ఉంది. కాంగ్రెస్ ను బూచిగా చూపడం బీజేపీ నేతలకు చాలా ఈజీ. అదిగో కాంగ్రెస్.. అంటూ బీజేపీ జనాలను బెదిరించగలదు, బుజ్జగించగలదు. కాబట్టి.. ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలువడం నల్లేరు మీద నడక. ఇలాంటి నేపథ్యంలో ఆప్ ఈ రాష్ట్రాల్లో గట్టిగా రంగంలోకి దిగితే మాత్రం.. కమలం పార్టీకి మాటల్లేకపోవచ్చు!
కాంగ్రెస్ ను విమర్శించినంత ఈజీగా ఆప్ ను బీజేపీ విమర్శించలేదు. బీజేపీతో పోల్చినా.. ఆప్ కు ఎంతో క్లీన్ ఇమేజ్ ఉంది. కాంగ్రెస్ ను విమర్శించమంటే ఇంకో ఇరవై యేళ్లు అయినా బీజేపీ విమర్శిస్తూనే ఉండగలదు.
కాంగ్రెస్ అరవై యేళ్ల పాలన అంటూ ఇంకో అరవై యేళ్లు బీజేపీ ప్రజలను మభ్యపెట్టనూ గలదు! బీజేపీ సాగిస్తున్న ఎనిమిదేళ్ల పాలపై ఆప్ కౌంటర్ అటాక్ చేయగలిగితే .. కమలానికి అప్పుడు అసలు ఇబ్బంది తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో.. కేజ్రీవాల్ ఢిల్లీ పాలనను తన డిప్యూటీ చేతిలో పెట్టి రావడం చాలా ఉత్తమం.
ఎలాగూ అక్కడ సమర్థులు ఉండనే ఉన్నారు. పంజాబ్ విజయం తర్వాత కేజ్రీవాల్ అవకాశం ఉన్న రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడమే సరైన పని, ఢిల్లీ సీఎంగా కొనసాగడం కంటే!