'ప్రజావేదిక' విషయంలో తెలుగుదేశం పార్టీ నేతల తీర్పులు కొనసాగుతూ ఉన్నాయి. అది అక్రమమే అయినా చంద్రబాబు నాయుడు కట్టించాడు కాబట్టి దాన్ని అలాగే ఉంచాలి, దాన్ని చంద్రబాబు నాయుడుకు అప్పగించేయాలని వారు కోరుతూ ఉన్నారు. అక్కడికేదో అది హెరిటేజ్ లాభాలతో నిర్మించినది అయినట్టుగా వాళ్లు ఆ భవనాన్ని చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వ్యవహారాల కోసం అప్పగించేయాలని కోరడం విడ్డూరంగా ఉంది.
ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా, ఏ మాత్రం ఇంగితం లేకుండా తెలుగుదేశం నేతలు ఆ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్లు గత ఐదేళ్ల కాలంలో ప్రతిపక్ష నేతను ఎలా ట్రీట్ చేశారో కూడా అందరికీ తెలిసిందే. అలాంటిది 23 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే నాయకుడు అయిన చంద్రబాబుకు మాత్రం ప్రధానమంత్రి స్థాయిలో ప్రాధాన్యత కావాలని కోరుతూ ఉన్నారు.
అది కూడా ఒక అక్రమ కట్టడాన్ని క్రమబద్ధీకరించి దాన్ని చంద్రబాబుకు అప్పగించాలని వారు కోరుతూ ఉండటం కామెడీగా మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కూడా తీర్పు ఇచ్చేశారు!
'అది అక్రమమో.. సక్రమమో.. ఏదైనా కావొచ్చు.. దాన్ని కూల్చాలనుకుంటే కూల్చొచ్చు..' అంటూ ఈయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూల్చకూడదట. ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చాకా దాన్ని కూల్చాలట. ఆఖర్లో.
అలా ఎందుకో తీర్పిచ్చిన కేశినేని కే తెలియాలి. ముందుగా ప్రభుత్వమే తమ ఆధీనంలోని అక్రమ కట్టడాన్ని కూల్చి అందరికి ఆదర్శంగా నిలవవచ్చు. ఎవ్వరినీ క్షమించేది లేదని అందరికీ సంకేతాలను పంపినట్టుగా అవుతుంది ఈ అక్రమ కట్టడాన్ని కూల్చడం ద్వారా. అయినా టీడీపీ నేతలకు ఆ అక్రమ కట్టడం మీద ఎనలేని ప్రేమే ఉన్నట్టుంది!