ఈ ప్రెస్ మీట్ పెట్టింది కరోనా అప్ డేట్స్ కోసమే కానీ, టీడీపీ వాళ్లని తిట్టడానికి కాదు.. అంటూనే ఎల్లో బ్యాచ్ ని ఓ రౌండ్ వేసుకున్నారు మంత్రి కొడాలి నాని. నాని మీడియా ముందుకొచ్చి చాలా రోజులైంది.. ఇప్పుడు వచ్చీరాగానే టీడీపీ బ్యాచ్ కి పూర్తిస్థాయిలో కౌంటర్ పడిపోయింది. రేషన్ సరకుల పంపిణీపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు నాని.
రేషన్ సరకులు తీసుకోడానికి వెళ్లిన ఓ వృద్ధురాలు క్యూలైన్లో నిలబడలేక మరణించిందంటూ ఓ వార్తను ఆల్ బోగస్ న్యూస్ ఛానెల్(ABN) ప్రసారం చేసిందని ఇలాంటి బోగస్ న్యూస్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వార్తలు చూసి చంద్రబాబు హైదరాబాద్ నుంచి డైరక్షన్ ఇస్తే.. ఇక్కడ కొన్ని కుక్కలు మొరుగుతున్నాయంటూ దేవినేని ఉమా, సోమిరెడ్డిపై మండిపడ్డారు మంత్రి నాని.
పనిలో పనిగా బాబు హైదరాబాద్ కే ఎందుకు ఫిక్స్ అయ్యారనే విషయాన్ని కూడా వివరించారు. 70 ఏళ్ల వయసులో కరోనా తనకెక్కడ వస్తుందోననే భయంతోనే అందరికంటే ముందు చంద్రబాబు హైదరాబాద్ చెక్కేశారని, తన కుటుంబ సభ్యులతో కలసి అద్దాల రూమ్ లో ఆక్సిజన్ పెట్టుకుని ఉంటున్నారని ఎద్దేవా చేశారు నాని. ఇకనైనా కోడిగుడ్డుపై ఈకలు పీకడం మాని, ప్రభుత్వం ఏంచేయాలి, ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందో చెప్పాలని సూచించారు.
కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందని, ఏపీలో కూడా ఒక చైనా వ్యక్తి ఉన్నాడని, ఆయనే చంద్రబాబు అని, చంద్రబాబు నుంచి సోకే వైరస్ యెల్లో వైరస్ అని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కరోనా వైరస్ కి ఇంకా ఎవరూ వ్యాక్సిన్ కనుక్కోలేదని, అయితే యెల్లో వైరస్ కోరలు పీకేసిన వ్యాక్సిన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు నాని. అద్దాల ఇంట్లో కూర్చుని, సొల్లు కబుర్లు చెప్పొద్దంటూ చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నాని.