ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మంత్రి కొడాలి నాని గర్జించారు. గత కొన్ని రోజుల పరిణామాల గురించి కొడాలినాని సునిశిత విశ్లేషణ చేస్తూ.. తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అనుకూల మీడియాకు చురకలు అంటించారు. ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి మీడియా సంస్థలు ఒక సామాజికవర్గం వారిని రెచ్చగొట్టిన తీరును ఏకేశారు కొడాలి నాని. అమరావతి అన్యాయం అయిపోతోందంటూ.. అది కమ్మ వాళ్లకు జరుగుతున్న అన్యాయం అంటూ..ఒక వర్గం మీడియా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఓపెన్ గా డిక్లేర్డ్ చేశాడు ఒక మీడియాధినేత.
జగన్ కు కమ్మ సామాజికవర్గం పై కక్ష అని.. అందుకే అమరావతి నుంచి రాజధానిని మారుస్తున్నారని ఆయన పచ్చిగా రాశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అలానే మాట్లాడారు. ఆఖరికి జేసీ దివాకర్ రెడ్డి కూడా అలా కమ్మ వాళ్ల విపరీతమైన జాలి వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమరావతి కి కొంచెం ప్రాధాన్యత తగ్గించడం వల్ల కమ్మ వాళ్లకు జరిగే అన్యాయం ఏమీ లేదని సూటిగా స్పష్టం చేశారు కొడాలి నాని.
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వ్యవహరించడం వల్ల కమ్మ వాళ్లకు నష్టం లేదన్నారు. అంతే కాదు.. విశాఖలో విస్తరించింది అంతా కమ్మ వాళ్లే అంటూ లెక్కలు తీయడం ఆసక్తిదాయకంగా ఉంది. విశాఖలో ఉన్న నాలుగు ప్రముఖ హోటల్స్ కమ్మ వాళ్లవే అని, విశాఖకు గత కొన్నేళ్లుగా ఎంపీలుగా వ్యవహరించిన వాళ్లంతా కమ్మ వాళ్లే అని , విశాఖలో రామోజీరావుకు వ్యాపార సామ్రాజ్యం ఉందని.. ఆయనతో పాటు అనేక మంది కమ్మ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు అక్కడ ఎదిగారని కొడాలి నాని గుర్తు చేశారు.
చంద్రబాబు నాయుడుకు బంధువు అయిన గీతమ్ యూనివర్సిటీ వాళ్లు కూడా కమ్మ వాళ్లే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమరావతి నుంచి కొంత రాజధానిని పక్కకు తీసుకెళ్తే కమ్మ వాళ్లకు అన్యాయం జరుగుతుందనేది పచ్చి అబద్ధమని, తమ కులస్తులను రెచ్చగొట్టడానికి చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియాధినేతలు అలా ప్రచారం చేస్తున్నారని.. కమ్మ వాళ్లకు తను భరోసా ఇస్తున్నట్టుగా కొడాలి నాని ప్రసంగించారు.
ఏబీఎన్ రాధాకృష్ణ గత కొన్నాళ్లుగా కమ్మ సామాజికవర్గాన్ని రెచ్చగొట్టే విశ్లేషణలన్నింటినీ కొడాలి నాని ప్రస్తావించి .. అవన్నీ దండగ మారి రాతలని, వైజాగ్ కు రాజధాని హోదా రావడం కమ్మ వాళ్లకే లాభదాయకం అని కొడాలి నాని అన్నారు.
గత కొన్నాళ్లు ఆందోళనలు అంటూ.. కొంతమంది తాగుబోతులను కుప్పేసి వారి చేత జగన్ ను, వైఎస్ ను జగన్ కుటుంబీకులను తిట్టించే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉందని, అలాంటి వారు వైఎస్ మరణాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నారని నాని అన్నారు. వైఎస్ మరణం గొప్పదని, రెండో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాకా ప్రజల కోసం వెళ్తూ ఆయన మరణించారని, ఆయన చేసిన మంచి పనులు ఈ రోజు ఆయన తనయుడిని 151 మంది ఎమ్మెల్యే బలంతో సీఎంను చేశాయని.. అలాంటి చావే గనుక తనకు వస్తే దాన్ని స్వీకరిస్తానని కొడాలి నాని అన్నారు. అలాంటి చావు గర్వకారణం అన్నారు.
ఊపు మీద ఉండిన తెలుగుదేశం వంటి పార్టీని తీసుకుని.. చివరకు దాన్ని 23 సీట్లకు పరిమితం చేసి, సొంత కొడుకును కూడా గెలిపించుకోలేని పరిస్థితి కంటే..వైఎస్ చావు చాలా గొప్పదని, అలాంటి దాన్ని తనుకూడా కోరుకుంటున్నట్టుగా కొడాలి నాని వ్యాఖ్యానించారు.