టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై భక్తి చాటుకుంటూనే, మరోవైపు సొంత పార్టీ నాయకులపై ఆయన పరోక్షంగా విరుచుకుపడ్డారు.
మరోవైపు తానేంటో రేపటి నుంచి చూపిస్తానని కోమటిరెడ్డి హెచ్చరిక కలకలం సృష్టిస్తోంది. ఈ హెచ్చరిక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కా లేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికా? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
హైదరాబాద్‌లో సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తన ప్రాణమని చెప్పారు. కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలుపెడుతానన్నారు. రేపటి నుంచి తానేంటో చూపిస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన దేవతగా అభివర్ణించారు.
తమ పార్టీ నేతలే అప్పుడు దయ్యం.. ఇప్పుడు దేవత అంటున్నారని తెలిపారు. పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారని ఘాటు విమర్శలు చేశారు. 72- 78 సీట్లు వస్తాయని మంత్రులు, ముఖ్య మంత్రుల పదవులు పంపకాలు కూడా చేసుకున్నారని ఆరోపించారు. తాను కేవలం జిల్లా లీడర్ మాత్రమే అన్నారు. వాళ్లంతా పెద్ద గొప్ప లీడర్లని వ్యంగ్యంగా అన్నారు. కేటీఆర్ సూటు బూటు వేసుకుంటే పెట్టుబడులు రావన్నారు.
ఇదిలా వుండగా కోమటిరెడ్డి ఉద్యమం కొత్తగా తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. రేపటి నుంచి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తారా లేక ప్రత్యర్థులపై ఉద్యమిస్తారా? అనేది తేలాల్సి వుంది. రేవంత్‌రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని కోమటిరెడ్డి రాజకీయ పంథాపై సందిగ్ధత కొనసాగుతూనే వుంది.