కర్ణాటక రాజకీయాలు కొత్తమలుపు తిరిగేలా కనిపిస్తూ ఉన్నాయి. బోటాబోటీ మెజారిటీతో ఏర్పాటు అయ్యింది యడియూరప్ప సర్కారు. త్వరలోనే ఉప ఎన్నికలు ఉన్నాయి. వాటిల్లో గనుక బీజేపీ నెగ్గుకురాలేకపోతే యడియూరప్ప సర్కారు మైనారిటీలో పడే అవకాశం ఉంది. ఉప ఎన్నికల తర్వాత మళ్లీ కాంగ్రెస్-జేడీఎస్ లు చేతులు కలిపితే బీజేపీ ప్రభుత్వ మనుగడ కష్టం అయ్యే అవకాశం ఉంది.
ఇలాంటి నేపథ్యంలో బీజేపీ తనదైన గేమ్ ప్లాన్ ను అమలు చేస్తున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి యూటర్న్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. మొన్నటివరకూ కాంగ్రెస్ తో చట్టపట్టాలేసుకున్న కుమారస్వామి ఇప్పుడు బీజేపీ వైపు మళ్లీ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ మేరకు ఆయన వ్యాఖ్యలే ఈ అంచనాలకు ఊతం ఇస్తున్నాయి. 'యడియూరప్ప ప్రభుత్వానికి సరైన మెజారిటీ లేదు. అయినా ఆ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే మేం సహకారం అందించి నిలబెడతాం..' అంటూ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూ ఉన్నాయి.
ఇటీవలే తీహార్ జైలుకు వెళ్లి డీకే శివకుమారను పరామర్శించారు. కుమారస్వామి వ్యవహారాలపై కూడా సీబీఐ, ఈడీలు కన్నేసే అవకాశాలున్నాయని, అందుకే ఆయన యూటర్న్ తీసుకుంటున్నారని.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేలా ఉన్నారని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.
సీబీఐ, ఈడీలకు భయపడి కుమారస్వామి బీజేపీకే మద్దతు పలికి, కర్ణాటకలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెడతానంటూ ప్రకటనలు చేస్తూ ఉన్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే కుమారస్వామికి రాజకీయ యూటర్న్ లు కొత్త కాదు. ఇలాంటివి బోలెడన్ని తీసుకుంటూ వస్తున్నారు. ఆ నేపథ్యాన్ని గమనించినా.. కుమారస్వామి ఇప్పుడు బీజేపీకి మద్దతు పలికినా పెద్దగా ఆశ్చర్యపోయేది ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.