తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పరారీలో ఉన్నారని తెలుస్తోంది. తహశీల్దార్ ను దూషించిన కేసులో ఆయన అరెస్టుకు పోలీసులు వెళ్లగా ఆయన వారికి చిక్కలేదని సమాచారం. తనను ఉదయం అరెస్టు చేస్తారని తెలుసుకున్న కూన అర్దరాత్రే ఇంటి నుంచి పరార్ అయ్యారని పోలీసులు ప్రకటించారు.
మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేశారట శ్రీకాకుళం జిల్లా పొందూరు తహశీల్దార్ రామకృష్ణ. ఆ టిప్పర్లు రవికుమార్ సోదరుడి పేరు మీద ఉన్నాయని సమాచారం. అక్రమంగా మట్టిని తవ్వి తీసుకెళ్తున్న వ్యవహారంలో వాటిని సీజ్ చేయగా, తహశీల్దార్ కు ఫోన్ చేసి ఇష్టానుసారం బెదిరించాడట కూన. ఎంత కావాలో తీసుకుని లారీలను వదిలేయాలని, పది వేలు కావాలా, లక్ష కావాలా.. అంటూ మొదలుపెట్టి, లంచానికి ఒప్పుకోని తహశీల్దార్ ను దూషించాడట కూన రవికుమార్. ఈ నేపథ్యంలో తనను ఆయన దూషించిన వైనంపై సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు సోమవారం ఉదయం ఆయన ఇంటికి వెళ్లగా, అప్పటికే ఆయన పరార్ అయినట్టుగా తెలుస్తోంది. అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ నేతల దురాగతాలకు హద్దు లేకుండా పోతున్నట్టుగా ఉంది.
అధికారులను తిట్టడం, దూషించడం.. ఇలాంటి వ్యవహారాల విషయంలో వీళ్లు ఇంకా దారికి రాలేదని స్పష్టం అవుతోంది. తీరా కేసులు నమోదయ్యాకా.. వీళ్లు పరార్ కావడం కూడా కొనసాగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ నేతలు ఈ తరహాలో పరారీ అయ్యి వార్తల్లోకి వచ్చారు. కూన రవికుమార్ కు ఇదే అలవాటుగా మారినట్టుగా ఉంది!