ఇండియాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి వల్ల లాక్ డౌన్ పరిస్థితులు మొదలయ్యే సరికే.. చైనాలో లాక్ డౌన్ దాదాపు ముగింపు దశలో ఉండింది. లాక్ డౌన్ వల్ల చైనాలో ఎదురైన దుష్ఫలితాల గురించి మిగతా దేశాల్లో చర్చ జరిగేది.
ఎక్కువన్నాళ్ల పాటు చైనాలో లాక్ డౌన్ వల్ల విడాకుల కేసుల సంఖ్య చాలా పెరిగిందని మీడియా రిపోర్ట్ చేసింది. భార్యాభర్తలు ఎక్కువ కాలం పాటు ఇళ్లకే పరిమితం అయ్యే సరికి.. ఒకరి పొడ మరొకరికి గిట్టని పరిస్థితి ఏర్పడిందనే విశ్లేషణలు వినిపించాయి.
ఆ వార్తలు మిగతా ప్రపంచాన్ని కూడా కాస్త ఆందోళనకు గురి చేశాయి, అయితే.. చైనా సంగతేమో కానీ, ఇండియాతో సహా ప్రపంచంలోని చాలా దేశాలను కరోనా లాక్ డౌన్ రొమాంటిక్ రిలేషన్ షిప్స్ పరంగా దుష్ఫలితాలు ఏమీ ఇవ్వలేదని అంటున్నాయి వివిధ అధ్యయనాలు. పైపెచ్చూ ఈ లాక్ డౌన్ రిలేషన్ షిప్ ను ఇప్పుడిప్పుడు మొదలు పెట్టిన వారికి చాలా సానుకూలంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయిప్పుడు.
లాక్ డౌన్ కు కొంచెం ముందు పెళ్లి చేసుకున్న వారు లేదా, లివింగ్ రిలేషన్ షిప్ ను మొదలుపెట్టిన వారు, లాక్ డౌన్ కాలంలోనే కొత్త బంధంలోకి అడుగిడిన వారు ఇంటికే పరిమితం అయిన ఈ కాలాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని అంటున్నాయి వివిధ అధ్యయనాలు.
ఇద్దరూ ఒకే ఇంట్లో ఎక్కువ కాలం గడపడం, ఆఫీసుకు వెళ్లే అవసరం, అవకాశం లేకపోవడం వల్ల ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునేందుకు సమయం దొరికిందని తెలుస్తోంది.
ఇంతకు ముందుతో పోలిస్తే ఈ లాక్ డౌన్ వల్ల పరస్పరం అర్థం చేసుకోవడం తొందరగా సాధ్యం అవుతుందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. జంటలు నాలుగు గదులకే పరిమితం కావడం వల్ల ఒకరికొకరంటే మరొకరికి విసుగురావడం సంగతేమో కానీ.. స్థూలంగా ఈ లాక్ డౌన్ తమ రొమాంటిక్ రిలేషన్ షిప్ ను మరింత రసవత్తరంగా, ఒకర్నొరకరు డీప్ గా అర్థం చేసుకునేందుకు అవకాశం లభించిందని చెప్పే వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నాయి అధ్యయనాలు.