మే 3 తర్వాత ఏమిటనే అంశం గురించి కేంద్రం ముందస్తుగానే కాస్త సమాచారం ఇచ్చింది. రెండో దశ లాక్ డౌన్ తర్వాత మూడో దశ లాక్ డౌన్ అమలవుతుందని కేంద్ర హోం శాఖ స్పష్టతను ఇచ్చింది. మే నాలుగో తేదీ నుంచి రెండు వారాల పాటు తదుపరి లాక్ డౌన్ ను ప్రకటించింది. అయితే ఈ మూడో దశ లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులను అయితే ఇచ్చేట్టుగా ఉన్నారు.
సూఛాయగా తెలుస్తోంది ఏమిటంటే.. గ్రీన్, ఆరెంజ్ జోన్ జిల్లాల్లో లాక్ డౌన్ నుంచి మినహాయింపు లభిస్తుందనేది. అయితే పూర్తిగా కాదు. కొద్ది మేర మాత్రమే. ఆ జిల్లాల్లో అంతర్గాతంగా ప్రయాణాలకు అవకాశాలు ఏర్పడేలా ఉన్నాయి. గ్రీన్ జోన్ లలో ఉన్న జిల్లాల్లో అయితే చాలా వరకూ జనజీవనం సాధారణ స్థితికి వచ్చేలా మినహాయింపులు ఉండనున్నాయి. ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు తప్పనిసరి. రెడ్ జోన్లకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మినహాయింపులూ ఉండవు.
ఏపీలో ఐదు జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు… ఈ ఐదు జిల్లాలూ రెడ్ జోన్లో ఉన్నాయని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. విజయనగరం జిల్లా మాత్రం గ్రీన్ జోన్లో ఉంది. మిగతా జిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి. ఇప్పటికే రెడ్ జోన్ జిల్లాల నుంచి మిగతా చోట్లకు ప్రజలను వెళ్లనివ్వడం లేదు. ఈ క్రమంలో రెడ్ జోన్ లోని జిల్లాలు ఇంకో రెండు వారాల పాటు లాక్ డౌన్ కు రెడీ అయిపోవాల్సిందే అని స్పష్టం అవుతూ ఉంది.
ఇక ఆరెంజ్ జోన్ జిల్లాల్లో జనజీవనం ఏ మేరకు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందో పూర్తి ప్రకటనలు వస్తే కానీ తెలియదు. ప్రధాని మోడీ రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారట. అప్పుడు మరింత కూలంకషంగా చెబుతారేమో. అయితే జోన్ లకు అతీతంగా స్కూల్ లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పార్కులు, గ్రౌండ్లు, జిమ్ లు, మాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు మూసి ఉంచబడతాయి. అన్ని జోన్ లలోనూ ఔట్ పేషెంట్ సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.