ఇది కరోనా కాలం. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల్ని అందరూ చెప్పేస్తున్నారు. వాట్సాప్ లో రకరకాల మెసేజీలు దర్శనమిస్తున్నాయి. ఇలానే ఉండాలి, ఇలానే చేయాలంటూ రకరకాల బోధనలు కూడా కనిపిస్తున్నాయి. నిత్యం వైసీపీపై విరుచుకుపడే నారా లోకేష్ ను కూడా సోషల్ మీడియాలో ఈ సందేశాలు ఎట్రాక్ట్ చేసినట్టున్నాయి. అందుకే నారా లోకేష్ కూడా ఇప్పుడు డాక్టర్ లోకేష్ అవతారం ఎత్తారు.
“కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారు. అందులో ప్రధానమైనది… అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవడం. మీది కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో, ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపులు తియ్యడంలాంటి పనులు చెయ్యండి. తద్వారా ఆ చేతితో మొహాన్ని తాకడం తగ్గుతుంది. ఈ చిన్న జాగ్రత్త కొంతవరకూ కరోనా బారిన పడకుండా ఆపుతుంది. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమే. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి.”
ఇలా సడెన్ గా తను కూడా కరోనా జాగ్రత్తలు చెప్పే వైద్యుడిగా మారిపోయారు లోకేష్. నిజానికి ఇలాంటివి లోకేష్ కు చాలా కొత్త. ఎక్కడ ఏ చిన్న సందు దొరుకుతుందా వైసీపీని, ముఖ్యమంత్రి జగన్ ను విమర్శిద్దామని కాచుక్కూర్చుంటారు చినబాబు. అయితే లోకేష్ కు ఇప్పుడు అలాంటి అవకాశాలు అరుదుగా మాత్రమే దక్కుతున్నాయి.
అసలే ట్విట్టర్ లేనిదే పూట గడవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరైన కంటెంట్ దొరకడం లేదు లోకేష్ కి. అందుకే ఇలా అందర్లా తను కూడా కరోనా జాగ్రత్తలంటూ ట్వీట్ వేశాడు. లోకేష్ చెప్పిన జాగ్రత్తలో కొంత నిజం ఉంది. కానీ ఎంతమంది పాటిస్తారనేది అనుమానం. బాగా అలవాటైన చేయిని పక్కనపెట్టి, మరో చేతిలో పనిచేయడమనేది ఒక్క రోజులో జరిగే పనికాదు. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అన్నట్టు తను చెప్పిన జాగ్రత్తను లోకేష్ అయినా పాటిస్తున్నారో లేదో!