ఒకప్పుడు సినిమాల్లో కామెడీ చేస్తూ బండ్ల గణేష్ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడాయన రీల్ లైఫ్‌లో వదిలేసి, రియల్ లైఫ్‌లో కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌లో చేరాడు. రాజకీయ పార్టీలు ఓటర్లను డబ్బులో ప్రలోభ పెడితే, కాంగ్రెస్ మాత్రం అదనంగా బండ్ల గణేష్ కామెడీని పంచిందని చెప్పొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ఓడితే బ్లేడ్‌తో గొంతుకోసుకుంటానని చెప్పి, ఆ తర్వాత కాలంలో బ్లేడ్ గణేష్‌గా మారిపోయాడు.
సీరియస్‌గా నడిచే రాజకీయాల్లో ఇటు తెలంగాణలో బండ్ల గణేష్, ఆంధ్రాలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ లేకపోతే …పరిస్థితి ఎలా ఉండేదో చెప్పడం కష్టం. కానీ ఏ మాటకామాట చెప్పాలంటే …కేఏ పాల్, బండ్ల గణేష్‌ను టీడీపీ యువకిశోరం లోకేశ్ మించిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో వకీల్‌సాబ్ ఫ్రీరిలీజ్ పంక్షన్లో బండ్ల గణేష్ చేష్టలు అందరినీ ఆకర్షించాయి.
సహజంగా సర్కస్‌లో జోకర్ పాత్ర చాలా చిన్నదే అయినా, మనసును వెంటాడేది మాత్రం ఆ పాత్రే. జీవితంలోనైనా, సినిమా ల్లోనైనా హాస్యానికి ఉన్న పాత్ర అలాంటిది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో లోకేశ్ భలే కామెడీని పండిస్తున్నారు. వకీల్‌సాబ్ ఫ్రీరిలీజ్ వేడుకలో బండ్ల గణేష్‌ను తిరుపతి ఎన్నికల ప్రచారంలో లోకేశ్ మాటలు మురిపిస్తున్నాయి, మరిపిస్తున్నాయి.
టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రకటించి నెటిజన్లకు చేతినిండా పని పెట్టారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ నుంచి 28 మంది రోబోలను పార్లమెంట్‌కు పంపారని లోకేశ్ విమర్శించారు.
వైసీపీ ఎంపీలను గొర్రెలంటూ… ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ అభాసుపాలవుతున్నారు. కేంద్రం ఏ చట్టం తెచ్చినా రోబోలు ఎస్ అంటూ మీట నొక్కుతున్నారని విమర్శించారు. మనకోసం పోరాడే పనబాక లక్ష్మి కావాలో జగన్‌కు తలొగ్గి నడిచే రోబో కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన తేల్చి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా టీడీపీ మాత్రం దేనికి నో అన్నదో లోకేశ్ చెబితే ఓటర్లు సంతోషిస్తారు. అడగకపోయినా కేంద్రానికి మద్దతు ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందా? అంటే, అది ఒక్క టీడీపీనే. వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చి, ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్న విషయం ఎవరికి తెలియదు. కావున చెప్పేదొకటి, చేసేదొకటే అనే చందంగా టీడీపీ వ్యవహరిస్తున్నదని అందరికీ తెలుసు.
కాకపోతే, లోకేశ్ తనదైన స్టైల్లో చెబుతూ రాజకీయాల్లో హాస్యాన్ని పండిస్తున్నారు. బండ్ల గణేష్‌కు గట్టి పోటీదారు తయారయ్యాడబ్బా అనే టాక్ వినిపిస్తోంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఓటర్లకు టీడీపీ లోకేశ్ రూపంలో అదనంగా కామెడీ పంచుతోందని చెప్పక తప్పదు.