లోకేశ్ ప‌ర్య‌ట‌న‌… హైడ్రామా!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, టీడీపీ యువ‌నేత నారా లోకేశ్‌ను లీడ‌ర్ చేసే వ‌ర‌కూ ఏపీ ప్ర‌భుత్వం నిద్ర‌పోయేలా లేదు. గ‌త నెల‌లో జ‌రిగిన సంఘ‌ట‌న త‌ల‌పించేలా…నేటి లోకేశ్ ప‌ర్య‌ట‌న హైడ్రామా సృష్టించ‌డం గ‌మ‌నార్హం.…

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, టీడీపీ యువ‌నేత నారా లోకేశ్‌ను లీడ‌ర్ చేసే వ‌ర‌కూ ఏపీ ప్ర‌భుత్వం నిద్ర‌పోయేలా లేదు. గ‌త నెల‌లో జ‌రిగిన సంఘ‌ట‌న త‌ల‌పించేలా…నేటి లోకేశ్ ప‌ర్య‌ట‌న హైడ్రామా సృష్టించ‌డం గ‌మ‌నార్హం. గుంటూరు జిల్లా గోళ్ల‌పాడులో ప్రేమోన్మాది చేతిలో హ‌త్య‌కు గురైన అనూష కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు లోకేశ్ గురువారం హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకున్న లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో పోలీసులు, నారా లోకేశ్‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. త‌న‌ను అడ్డుకోవ‌డంపై లోకేశ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తన పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లడం లేదని.. ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకే వెళ్తున్నానని పోలీసుల‌కు చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడి వ‌స్తాన‌ని పోలీసుల‌కు చెప్పినా వినిపించుకోలేదు.

కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి విజ‌య వాడ వైపు పోలీసులు వాహ‌నంలో త‌ర‌లించేందుకు సిద్ధ‌మ‌య్యారు. పోలీసుల వాహ‌నాన్ని టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కాసేపు నిలువ‌రించారు. వారంద‌రినీ పోలీసులు చెద‌ర‌గొట్టి అక్క‌డి నుంచి లోకేశ్‌ను త‌ర‌లించ‌డం రాజ‌కీయ దుమారానికి కార‌ణ‌మైంది.

గ‌త నెల‌లో ప్రేమోన్మాది చేతిలో హ‌త్యకు గురైన‌ బీటెక్ విద్యార్థిని ర‌మ్య  మృత‌దేహాన్ని చూసి, బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శిం చేందుకు లోకేశ్ వెళ్లారు. ర‌మ్య కుటుంబం వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కుంది. చివ‌రికి లోకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డం, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌లు నిర్వ‌హించ‌డం తెలిసిందే.  అస‌లే సోష‌ల్ మీడియా నుంచి బ‌య‌ట‌కు రాని లోకేశ్ అరెస్ట్ కావ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది. మొట్ట మొద‌టి సారిగా త‌మ యువ నాయ‌కుడు అరెస్ట్ కావ‌డంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉర‌కలెత్తింది.

మ‌రోసారి అరెస్ట్ కాక‌పోయినా, పోలీసుల అడ్డగింత‌తో టీడీపీ శ్రేణుల‌కు ప‌ని దొరికిన‌ట్టైంది. లోకేశ్ నాయ‌క‌త్వంపై భరోసా క‌లిగించేందుకు చంద్ర‌బాబు, ఎల్లో మీడియా. విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కానిది… వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేస్తోంద‌నే అభిప్రాయం లేక పోలేదు. లోకేశ్‌ను అలా విడిచి పెట్టి వుంటే,  ప‌రామ‌ర్శించి వెళ్లిపోయేవార‌ని చెబుతున్నారు. ఇప్పుడు అదుపులోకి తీసుకోవడంతో సీన్ క్రియేట్ చేసేందుకు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మైంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.