టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్…ఇటీవల పెద్ద వస్తాదులా మారాడు. ‘నేను కూడా పోస్ట్ చేస్తున్నా. ఏం చేస్తారో చేసుకోండి’ అని తరచూ జగన్ సర్కార్‌కు సవాల్ విసురుతున్నాడు. తాజాగా పులివెందులకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్‌కుమార్‌రెడ్డి జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలపై లోకేశ్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు.
‘కేంద్రం మెడలు వంచేస్తా అన్న వస్తాదు సోషల్ మీడియా పోస్టులకు భయపడడం ఏంటి? పులివెందుల పులి అని డప్పు కొట్టించుకున్నారు. ఇప్పుడు పులి, పిల్లి అయ్యిందా? వైకాపా ప్రభుత్వం అమ్మ ఒడి పథకానికి బడుగు, బలహీన వర్గాలకు చెందాల్సిన రూ.6,500 కోట్లు పక్కదారి పట్టించింది. ఈ విషయాన్ని తెలియజేసే సామాజిక మాధ్యమంలో వస్తున్న పోస్టులకు ఎందుకు భయపడుతున్నావ్’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశాడు.
బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ పులివెందులకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్‌కుమార్‌రెడ్డి అనే ఒక యువకుడు వీడియో పోస్ట్ చేశాడని, ఆవేదన వ్యక్తపరిచినందుకు పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశ పెట్టేంత తప్పు ఏం చేశాడని లోకేశ్ నిలదీశాడు. విజయ్ పోస్ట్ చేసిన వీడియోను తాను పోస్ట్ చేస్తున్నానని, ఏం చేస్తారో చేసుకోవాలని లోకేశ్ సవాల్ విసిరాడు.
పులివెందులకు చెందిన యువకుడు జగన్ సర్కార్ విధానాలను ప్రశ్నిస్తుంటే…యువకిశోరం లోకేశ్ ఏం చేస్తున్నట్టు? పోలీసులు అరెస్ట్ చేస్తే…విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడా పోస్టును తాను కూడా షేర్ చేస్తున్నానని చెప్పడం ఏమైనా గొప్పా? ఆ యువకుడి కంటే లోకేశ్ ఆ పని ముందు ఎందుకు చేయలేకపోయాడు? ఏవేవో ఎందుకూ ప్రజలకు ఉపయోగపడని ట్వీట్స్ చేసే లోకేశ్…ఇలాంటి వాటిపై దృష్టి ఎందుకు పెట్టడం లేదు?