నారా లోకేశ్…మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు మాత్రమే కాదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. టీడీపీ భవిష్యత్ ఆశా కిరణం. చంద్రబాబునాయుడు తర్వాత పార్టీ పగ్గాలు పట్టుకోవాల్సిన యువనేత. ఇన్ని బరువు బాధ్యతలున్న నారా లోకేశ్ ఎంత హూందాగా వ్యవహరించాలి? టీడీపీ శ్రేణులకు పార్టీ భవిష్యత్‌పై ఒక భరోసా కలిగించేలా తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకునేలా నడుచుకోవాలి.
కానీ లోకేశ్ 24 గంటలూ ట్విటర్‌కు పరిమితమై…తన పేరుతో ఏదో ఒక ట్వీట్ చేస్తూ తానూ ఉన్నానంటూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారం పోవడంతో క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి కూడా సాహసించని పరిస్థితుల్లో ఉంటే…పార్టీ జాతీయ కార్యదర్శిగా ట్విటర్‌లో కాలం వెళ్లదీయడంపై కార్యకర్తలు జీర్ణించుకోలేకున్నారు.
పోనీ ట్విటర్ వేదికగానైనా టీడీపీ శ్రేణులకు అభయహస్తం కల్పిస్తున్నారా అంటే అదీ లేదు. ఏదో కాలక్షేపం కబుర్లు, జగన్‌పై నాసిరక విమర్శలు చేయడం మినహా….ఆ ట్వీట్లలో పరిణతి కనబరచడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ…తాజాగా లోకేశ్ చేసిన ట్వీట్‌నే పరిశీలిద్దాం.
సీఎం జగన్ మంచి కటింగ్ మాస్టర్ అని వ్యాఖ్యానించారు. చట్టబద్ధగా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్ చేసి 24 శాతానికి తగ్గించారన్నారు. రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ బీసీలను దెబ్బతీస్తూ రిజర్వేషన్లు పార్టీపరంగా అమలు చేస్తున్నామని కటింగ్ ఇస్తున్నారంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఆల్రెడీ జగన్ తన పార్టీ తరపున బీసీలకు పది శాతం రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే బీసీలకు వైసీపీ 34 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన టికెట్లు కేటాయించింది. అలాంటప్పుడు బీసీలకు రిజర్వేషన్లలో జగన్ వల్ల పది శాతం నష్టం జరిగిందని చెప్పడం వల్ల లోకేశ్ ఆ సామాజికవర్గానికి ఎలాంటి సందేశం పంపాలనుకున్నాడో అర్థం కావడం లేదు.
కనీసం తన పేరుతో వెలువడిన ట్వీట్ తనకైనా అర్థమైందో లేదో మరి! బహుశా ఈ ట్వీట్ ఎప్పుడో చేయాలనుకుని…మరిచిపోయి ఇప్పుడు పోస్ట్ చేసినట్టుంది. ఎంతకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది.