మతి మరుపు పుణ్యాన వందలాది కోట్లను పోగొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మతి మరుపు అన్ని వేళలా మంచిది కాదనే వాస్తవాన్ని తాజా ఉదంతం హెచ్చరిస్తోంది. జీమెయిల్, ఆన్లైన్ బ్యాంకు ఖాతాల పాస్‌వర్డ్‌లను మరిచిపోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పటికీ గుర్తించుకోవాల్సిన పాస్వర్డ్లు కొన్ని ఉంటాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా … కొంప కొల్లేరవుతుంది.
సరిగ్గా ఇలాంటి పరిస్థితే జర్మనీ వాసికి ఎదురైంది. అయితే ఆన్లైన్ బ్యాంక్ ఖాతాను మరిచిపోవడం వల్ల అతను ఏకంగా మన ఇండియన్ కరెన్సీలో రూ.1800 కోట్లు పోగొట్టుకునే ప్రమాదకర పరిస్థితి ఎదురైంది. జర్మనీకి చెందిన స్టీఫెన్ థామస్ శాన్‌ఫ్రాన్సి స్కోలో ప్రోగ్రామర్‌గా పని చేస్తున్నాడు. 2011లో ఆయన 7,002 బిట్ కాయిన్ల ( డిజిటల్ కరెన్సీ)ని కొన్నాడు.
ఇప్పుడు దాని విలువ రూ.1,800 కోట్లకు పైగా (245 మిలియన్ డాలర్లు) పెరిగింది. ఇది ఆయనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేదే. ఇంత వరకూ అంతా బాగుంది. అసలు సమస్య ఇప్పుడే ఎదురైంది. ఆ కాయిన్లను ఐరన్‌కీ అనే ఎన్క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్‌లో పాస్‌వర్డ్‌తో ఆయన భద్రపరుచుకున్నాడు. మిగిలిన చోట్ల పాస్వర్డ్ మరిచిపోతే బ్యాంక్‌కు పోయి, తిరిగి పునరుద్ధించుకున్నట్టు ఇక్కడ అలాంటి సౌకర్యం లేదు.
ఒకవేళ ఎవరైనా పాస్వర్డ్ మరిచిపోతే , తిరిగి కనుక్కునేందుకు 10 సార్లు మాత్రమే అవకాశం కల్పించారు. అంతకు మించి పాస్‌వర్డ్‌ను టైప్ చేస్తే … ఇక ఆ మొత్తాన్ని శాశ్వతంగా మరిచిపోవాల్సిందే. పదిసార్లకు మించి ఒక్కసారైనా పాస్‌వర్డ్‌ను తప్పుడా నమోదు చేస్తే ఆ హార్డ్ డ్రైవ్‌లో ఉన్న మొత్తం డేటా మాయమవుతుంది. ఇది దానికి సంబంధించిన కఠిన నిబంధన.
జర్మనీ వాసి థామస్ తన పాస్‌వర్డ్‌ను మరచిపోవడంతో పెద్ద సమస్య ఎదురైంది. పాస్‌వర్డ్‌ను గుర్తుకు తెచ్చుకునే క్రమంలో ఇప్పటికే 8 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక కేవలం అతనికి రెండే రెండు అవకాశాలున్నాయి. దీంతో పాస్‌వర్డ్‌ను ఎలాగోలా గుర్తు తెచ్చుకునేందుకు శతవిధాలా అతను ప్రయత్నిస్తున్నాడు.
ఏ మాత్రం తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేసినా …రూ.1800 కోట్ల మొత్తాన్ని మరిచిపోవాల్సి వస్తుందనే భయం, అతన్ని అడుగు ముందుకు వేయనివ్వడం లేదు. ఇప్పటి వరకూ ఇలా పాస్వర్డ్లు మర్చిపోవడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోల్పోయిన క్రిప్టో కరెన్సీ సొమ్ము రూ.9.5 లక్షల కోట్లకు పైగానే ఉందట!