దివంగత వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసింది.
ఇంతకాలం తాను జగనన్న వదిలిన బాణంగా చెప్పుకున్న షర్మిల, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. తాను ఎవరో వదిలిన బాణం ఎంత మాత్రం కాదని ఆమె తేల్చి చెప్పారు. ఈ నెల 8న పార్టీ ఆవిర్భావ సభా వేదికగా వైఎస్సార్‌టీపీ విధివిధానాలను వెల్లడించారు.
కొత్త పార్టీపై షర్మిల అభిప్రాయాలు ఏవైనా ….ఆమె వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారని నమ్మేవాళ్లే ఎక్కువ. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ స్థాపించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
షర్మిల పార్టీ నిర్మాత అన్న వైఎస్ జగన్, డైరెక్షన్ తెలంగాణ సీఎం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో సూది పోగొట్టుకుని, తెలంగాణలో షర్మిల వెతుక్కుంటే ఎలా అని నారాయణ సెటైర్లు విసిరారు. షర్మిల పార్టీ వెనుక జగన్, కేసీఆర్ ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని ఆయన డిమాండ్ చేశారు.
షర్మిల పార్టీపై తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మక మౌనం పాటించడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒకవేళ షర్మిల విమర్శలకు కౌంటర్లు ఇవ్వాలన్నా… పరోక్షంగా తప్ప ప్రత్యక్షంగా ఆమె పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.
పార్టీ ఆవిర్భావ సభ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడినా తెలంగాణ అధికార పార్టీ సంయమనం పాటించడం విశేషం. అలాగే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ కూడా షర్మిలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం ద్వారా, ఆమె రాజకీయ పార్టీని గుర్తించడానికి నిరాకరించడమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే… తమ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముద్దుల తనయ కావడంతో, ఏం మాట్లాడినా పట్టించుకోవద్దనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.