‘మా’ ఎన్నికలపై ఏపీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వ వైఖరిని తేల్చి చెప్పారు. ఆ ఎన్నికలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని ఆయన కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వ కేంద్రంగా ‘మా’ ఎన్నికల ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
మరీ ముఖ్యంగా ‘మా’ అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బావ అవుతారని, అలాగే కేసీఆర్‌తోనూ మంచి సంబంధాలున్నట్టు చెప్పడం వివాదానికి దారి తీసింది.
ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్‌లను సినీ ఎన్నికల్లోకి లాగడంపై ప్రకాశ్‌రాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికల్లోకి వైఎస్ జగన్, కేసీఆర్, బీజేపీలను లాగుతారా? వైఎస్ జగన్ మీ బంధువైతే ‘మా’ ఎన్నికలకు వస్తారా? రెండు సార్లు హలో చెబితే కేటీఆర్ ఫ్రెండ్ అయిపోతారా?’ అని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని మంత్రి పేర్ని నాని ప్రకటించడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
ఈ సందర్భంగా పేర్ని నాని ‘మా’ ఎన్నికలపై ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం.
‘తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహ న్‌రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అక్టోబరు 10న జరగనున్న ‘మా’ ఎన్నికల విషయమై ఏపీ ప్రభుత్వానికి ఏ మాత్రం ఆసక్తి, ఉత్సాహం లేదు. ‘మా’ఎన్నికల్లో ఏ వ్యక్తినీ, వర్గాన్ని మేము సమర్థించటం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికీ ఈ విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నా’ అని పేర్ని తెలిపారు.
ఇప్పటికైనా ‘మా’ ఎన్నికల్లోకి వైఎస్ జగన్‌ను లాగడం ఆగుతుందో, లేదో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.