తాము కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ లు ప్రకటించాయి. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన నడుస్తున్న రాష్ట్రంలో అలా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అవి భావిస్తున్నాయి. గవర్నర్ వారికి ఎప్పటికి అవకాశం ఇస్తారో చూడాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. తమకూ మెజారిటీకి దగ్గరదగ్గరగా సీట్లున్నాయని, తాము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ బీజేపీ ప్రకటిస్తూ ఉంది. అయితే బీజేపీ దగ్గర అధికారికంగా సంఖ్యాబలం లేదు.
దీంతో గవర్నర్ కమలం పార్టీకి అవకాశం ఇవ్వలేరు. ప్రస్తుతానికి కూటమికే అవకాశం ఇచ్చినా,ఆ కూటమిని ఎన్నాళ్లు పాలించనిస్తారు? అనేది సందేహమే. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు ఏర్పడిన నాటి నుంచినే దానికి గండం కొనసాగింది. ఏడాది కాలం తర్వాత ఎలాగోలా ఆ కూటమి ప్రభుత్వం పడిపోయింది. బీజేపీకి అధికారం దక్కింది.
మినిమం మెజారిటీ లేకపోయినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉప ఎన్నికలతో ఆ ప్రభుత్వం మరో పరీక్షను ఎదుర్కొంటూ ఉంది. కర్ణాటకలోని సీన్ ను చూస్తే.. అచ్చం అలాంటి సీన్లే మహారాష్ట్రలో సాగేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.