మరో 30 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగాలని కలలు కంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రత్యర్థులెవరో కాదు సొంత పార్టీ ప్రజాప్రతినిధులే. వారి వ్యవహార శైలి పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తోంది. బహిరంగ సభా వేదికపై మాట్లాడుతున్నామనే స్పృహ కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ వైఖరి సర్వత్రా విమర్శల పాలవుతోంది. ఇది ఉద్యోగుల్లోనూ, పౌర సమాజంలోనూ వ్యతిరేకత పెంచేలా ఉంది.
మూడు రోజుల క్రితం నాటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్ర పారిశ్రామిక శిక్షణ కేంద్రాల ఉద్యోగుల సంఘం 12వ రాష్ట్ర మహాసభలను విజయవాడ ఎంబీవీకేలో ఈ నెల 22న నిర్వహించారు. ఈ సభకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) హాజరయ్యారు. సభలో ఐవీ జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు వివాదానికి కారణమయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎమ్మెల్సీపై నోరు పారేసుకున్నారు.
సభను ఉద్దేశించి ఎమ్మెల్సీ ఐవీ మాట్లాడుతూ…‘ప్రస్తుత పాలకులు ఉద్యోగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్రెడ్డి ముందు రెండు, వెనుక రెండు సౌండ్ బాక్సులు పెట్టుకుని అందరికీ వినిపించేలా అధికారంలోకి రాగానే ఉద్యోగులకు డీఏలను, పీఆర్సీని సకాలంలో చెల్లిస్తామని చెప్పారు.
సీపీఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా పట్టించుకోలేదు. 40,50 ఏళ్ల ఉద్యమ చరిత్రలో మూడేళ్లయినా పీఆర్సీని బయట పెట్టకుండా ఉంచిన ప్రభుత్వాన్ని నేను చూడలేదు’ అని విమర్శించారు.
అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ … ‘పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి మైకులు, స్పీకర్ బాక్సులు పెట్టుకుని తిరిగిన విషయం ఈ సమావేశంలో అవసరమా? ఇది సందర్భమా? మమ్మల్ని పిలవకుండా మైకులు పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. మమ్మల్ని పిలిచినప్పుడు మైకు దొరికింది కదా అని ఎలాపడితే అలా మాట్లాడొద్దు. ఇదేమైనా మీ సొంత పార్టీ వ్యవహారమా? డోంటాక్. ఎమ్మెల్సీ అని గౌరవమిస్తున్నా గుర్తు పెట్టుకోండి. మీ ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఏం సాధిస్తారు? ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాకు అనేక అంశాలపై సలహాలు ఇస్తుంటారు. వాటీజ్ దిస్ నాన్సెన్స్. మీ వల్ల ఏం జరుగుతుంది? వాటీజ్ దిస్! జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే స్థాయి, అర్హత మీకుందా? ’ అని ఆగ్రహం ప్రదర్శించారు.
మల్లాది విష్ణు వైఖరిపై సోషల్ మీడియాలో సొంత పార్టీ శ్రేణులు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. బహిరంగ సభల్లో మాట్లాడే టప్పుడు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు వినమ్రతతో మాట్లాడాల్సింది పోయి, ఏమిటీ లెక్కలేనితనం అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా ఇలాగే వ్యవహరించి చివరికి అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
తప్పు వైసీపీ ఎమ్మెల్యేలది, చివరికి అధినేత మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు నెటిజన్స్ ‘మల్లాది విష్ణు…వాటీజ్ దిస్ నాన్సెన్స్!’ అంటూ ఆయన మాటలను ఆయనకే అప్పచెబుతూ సెటైర్లు విసురుతున్నారు.