కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఇక మీదట పాల్గొనని ఆమె ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
కోల్‌కతాలో మొత్తం 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మూడు విడతల ఎన్నికలు మిగిలి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మమత తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా పశ్చిమబెంగాల్‌లో కరోనాను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు.
కరోనా విజృంభిస్తుండడంతో ఇప్పటికే మమతా బెనర్జీ స్పందిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక అప్పీల్ చేశారు. కరోనా సెకండ్ వేవ్‌ను పరిగణలోకి తీసుకుని మూడు విడతల్లో జరగాల్సిన ఎన్నికలను ఒక విడతలోనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా కోల్‌కతాలో ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఈ నెల 26న సింబాలిక్ మీటింగ్‌ను మాత్రమే మమత నిర్వహించనున్నట్టు టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ తెలిపారు. అలాగే ఇతర జిల్లాల్లో కేవలం 30 నిమిషాలు మించకుండా ర్యాలీలు నిర్వహించాలని మమత ఆదేశించినట్టు ఒబ్రెయిన్ ట్వీట్ చేశారు.
ఇప్పటికే రాహుల్ తన ఎన్నికల సభను రద్దు చేసుకోవడం, మమత ప్రచారం నిర్వహించకూడదని నిర్ణయించుకున్న నేపథ్యంలో బీజేపీ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.