నేరం చేసి తప్పించుకోవాలనుకోవడం అసాధ్యం. ఆ విషయం మరోసారి రుజువైంది. హత్య జరిగిన 22 ఏళ్ల తర్వాత నిందితుడ్ని పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది.
కొత్తగూడెం టూ-టౌన్ పోలీస్ స్టేషన్ పరిథిలో 1994లో ఓ హత్య జరిగింది. ఇందులో ప్రధాన నిందితుడు ప్రహ్లాద్ మౌర్య. హత్య జరిగిన వెంటనే అతడ్ని అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటకు కూడా వచ్చాడు. ఆ కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. ఇక అంతా ఓ కొలిక్కి వచ్చిందనుకున్న టైమ్ లో ప్రహ్లాద్ పరారయ్యాడు.
అలా 1998 నుంచి కనిపించకుండా పోయాడు ప్రహ్లాద్. పోలీసులు కూడా ఈ కేసును పక్కనపెట్టారు. అలా తెలంగాణ వదిలి వెళ్లిన ప్రహ్లాద్.. దాదాపు 20 ఏళ్ల పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని వివిధ పట్టణాల్లో తలదాచుకున్నాడు. కేసును పోలీసులు మరిచిపోయి ఉంటారని భావించి, ఈమధ్యే మణుగూరు వచ్చి సెటిల్ అయ్యాడు.
ప్రహ్లాద్ మణుగూరు వచ్చి కూడా రెండేళ్లు అవుతోంది. దీంతో తనకిక ఎదురులేదని భావించాడు. కానీ పోలీసులు మాత్రం 22 ఏళ్ల కిందటి ఆ కేసును వదల్లేదు. పెండింగ్ కేసుల్ని మరోసారి తిరగదోడే క్రమంలో ఈ కేసు తెరపైకొచ్చింది. అప్పటి పోలీసులు ఇప్పుడు లేరు. అయినప్పటికీ ఫైల్ లో ఉన్న ఆధారాలు ఆధారంగా విచారించగా.. చుట్టూతిరిగి మణుగూరులో నిందితుడు ఉన్నట్టు తెలుసుకున్నారు.
ప్రహ్లాద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఖమ్మం సెషన్స్ కోర్ట్ ఆదేశాలతో అతడ్ని రిమాండ్ లోకి తీసుకున్నారు. అలా హత్య జరిగిన 22 ఏళ్ల తర్వాత ప్రహ్లాద్ మరోసారి పోలీసులకు చిక్కాడు. ఈసారి అతడు బయటకు రావడం అసాధ్యం అంటున్నారు పోలీసులు.