కోరిక తీరిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తా..!

నిరుద్యోగులకు వల వేసి డబ్బులు కొట్టేసేవారిని చాలామందిని చూసి ఉంటాం. ఉద్యోగాలిప్పిస్తామంటూ లక్షలకు లక్షలు కట్టించుకుని మోసం చేసి పరారయ్యే సంస్థల గురించీ విని ఉంటాం. కానీ ఇక్కడ ఓ అమ్మాయి ఉద్యోగం పేరుతో…

నిరుద్యోగులకు వల వేసి డబ్బులు కొట్టేసేవారిని చాలామందిని చూసి ఉంటాం. ఉద్యోగాలిప్పిస్తామంటూ లక్షలకు లక్షలు కట్టించుకుని మోసం చేసి పరారయ్యే సంస్థల గురించీ విని ఉంటాం. కానీ ఇక్కడ ఓ అమ్మాయి ఉద్యోగం పేరుతో తన శీలాన్నే పోగొట్టుకుంది. 

ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మకంగా చెప్పిన ఫేస్ బుక్ ఫ్రెండ్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సర్టిఫికెట్లు అన్నీ తనవద్దే పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె జీవితంతో ఆడుకున్నాడు..

అసలేం జరిగిందంటే..?

ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీకి చెందిన 19 ఏళ్ల ఓ యువతి పోలీస్ ట్రైనింగ్ కోసం పక్కనే ఉన్న మరో పట్టణానికి వచ్చింది. ట్రైనింగ్ తీసుకుంటూ హాస్టల్ రూమ్ లో ఉంటోంది. ఈ క్రమంలో ఫేస్ బుక్ ఆమెకు బాగా అలవాటైంది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన రాహుల్ అనే వ్యక్తి అలా ఆమెకు ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. 

ఆ పరిచయం కాస్తా ఫోన్ కాల్స్ లోకి మారింది. ఉద్యోగ వేటలో ఉన్న ఆ యువతికి మధ్యప్రదేశ్ లో మంచి ఉద్యోగం ఉందంటూ నమ్మకంగా చెప్పి గ్వాలియర్ కి పిలిపించుకున్నాడు రాహుల్. మంచి ఫైవ్ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేశాడు. ఆ హంగామా అంతా చూసి రాహుల్ పై నమ్మకం ఉంచిన సదరు యువతి హోటల్ లో అతనితోపాటే ఉండేందుకు ఒప్పుకుంది.

ఇంకేముంది మత్తు మందు కలిపిన ఆహారం తినిపించి మానభంగం చేశాడు రాహుల్. ఆ బాధలో ఆమె ఉద్యోగం వద్దంటూ అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసింది. తీరా హాస్టల్ కి వచ్చాక, తన సర్టిఫికెట్లన్నీ రాహుల్ వద్ద మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చింది. దీంతో సర్టిఫికెట్ల కోసం మరోసారి గ్వాలియర్ వెళ్లింది. సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈసారి సర్టిఫికెట్లు అడ్డుపెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు. తన అవసరం తీరాక, సర్టిఫికెట్లు ఇవ్వను నీ దిక్కున్నచోట చెప్పుకో పో అంటూ రాహుల్ ఆమెను వెళ్లగొట్టాడు.

అప్పటికే రెండుసార్లు మోసపోయిన ఆ యువతి.. మరోసారి రాహుల్ ని బతిమిలాడుకోవడం వృథా అనుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సర్టిఫికెట్లు ఇప్పిస్తే చాలని వేడుకుంది. యూపీ పోలీసులు ఆ యువతి ఫిర్యాదు మేరకు రాహుల్ ని వేటాడే పనిలో పడ్డారు. ముక్కుమొహం తెలియని ఫేస్ బుక్ స్నేహాలు ఎంత ప్రమాదకరమో మరోసారి చాటిచెప్పింది ఈ ఘటన.