ఛార్జర్ తో సెల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టుకోవచ్చు. కానీ అదే ఛార్జర్ వైరును ఉరితాడుగా కూడా మార్చేయొచ్చని నిరూపించాడు విశాఖ జిల్లాకు చెందిన కుళ్లయ్య. తన మొబైల్ ఛార్జర్ తో ఏకంగా ఓ వ్యక్తిని హత్యచేశాడు. పోలీసులు ఛేదించిన ఈ కేసులో అక్రమ సంబంధం కోణం వెలుగుచూసింది.
పరవాడ మండలం హస్తినాపురం అనే గ్రామానికి చెందిన ధర్మరాజు, ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి మద్యం అలవాటు ఉంది. దిబ్బపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి రోజూ సారా తాగడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.
కంపెనీలో ఉద్యోగం ముగిసిన వెంటనే మహిళ ఇంటికి ధర్మరాజు వెళ్లడం, సారా తాగడం.. ఇద్దరూ దగ్గర్లోనే ఉన్న జీడితోటలో రహస్యంగా కలుసుకోవడం ఆనవాయితీగా మారింది. కొన్ని రోజులకు మహిళ భర్త కుళ్లయ్యకు అనుమానం వచ్చింది. నిఘా పెట్టి అది నిజమేనని నిర్థారించుకున్నాడు.
ఎప్పట్లానే ఈనెల 2వ తేదీన ధర్మరాజు సారా తాగడానికి రెడీ అయ్యాడు. తన భార్య సారాయి పట్టుకొని జీడిమామిడి తోటలోకి వెళ్లడం గమనించాడు కుళ్లయ్య. రహస్యంగా ఆమెను అనుసరించాడు. అతడి అనుమానమే నిజమైంది. అక్కడ ధర్మరాజు ఉన్నాడు. కోపం పట్టలేని కుళ్లయ్య, ధర్మరాజు మెడకు తన సెల్ ఫోన్ చార్జర్ బిగించాడు. తీవ్రంగా పెనుగులాడిన ధర్మరాజు.. ఛార్జర్ వైరు గట్టిగా బిగుసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.