మండలాల వైనం మరిచారా?

ఏ వంక లేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చింది అన్నది సామెత. కొత్త జిల్లాల ఏర్పాటును జీర్ణించుకోలేకపోతున్న 'దేశం' అనుకుల సామాజిక మీడియా ఇప్పుడు దూరం..దూరం అనే దాన్ని పట్టుకుని యాగీ చేయాలని చూస్తోంది. ఈ…

ఏ వంక లేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చింది అన్నది సామెత. కొత్త జిల్లాల ఏర్పాటును జీర్ణించుకోలేకపోతున్న 'దేశం' అనుకుల సామాజిక మీడియా ఇప్పుడు దూరం..దూరం అనే దాన్ని పట్టుకుని యాగీ చేయాలని చూస్తోంది. ఈ మండలం జిల్లా కేంద్రానికి దూరంగా వుంది. ఆ మండలం జిల్లా కేంద్రానికి దూరమైంది అంటూ కథనాలు వండుతున్నారు.  

జిల్లా కేంద్రం ఏ విధంగా నడిమధ్యలోకి వస్తుందో అన్నది సదరు మీడియానే చెప్పాలి. ఎక్కడో ఒక దగ్గర తప్ప ప్రధానమైన పట్టణం జిల్లా నడిమధ్యన వుండదు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం జిల్లా సరిహద్దుకు దాదాపు 150 కిలోమీటర్ల దూరం. విజయనగరం జిల్లా కేంద్రం దాని సరిహద్దుకు దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం. 

విశాఖ జిల్లా కేంద్రం దాని సరిహద్దుకు 120 నుంచి 200 కిలోమీటర్ల దూరం. ఇలాగే వున్నాయి ఇప్పటి వరకు వున్న జిల్లాలు అన్నీ. మరి అప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేదేం? ఇంత దూరం అయిపోయింది. దగ్గరగా తీసుకురండి అని వార్తలు వండి వార్చలేదేం? అమరావతి ఏమన్నా ఇచ్ఛాపురానికి దగ్గరా? కడప కు దగ్గరా?

ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల జిల్లా కేంద్రానికి సరిహద్దుకు దూరం దాదాపు 70 నుంచి 100 కిలోమీటర్లకు వచ్చేసింది. ఈ దూరాన్ని కూడా ఇంకా తగ్గించేలా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నంలో వుంది ప్రభుత్వం. దాన్ని వదిలేసి ప్రజలను ఎలాగైనా రెచ్చగొట్టే ప్రయత్నమే పనిగా పెట్టుకుంది ఈ 'దేశం' సామాజిక అనుకుల మీడియా. 

ఓ కొత్త ప్రయత్నం చేసినపుడల్లా ప్రజల్లో కాస్త ఆందోళన వుంటుంది. అది సహజం. ప్రతి ఒక్కరికీ తమ ఊరు జిల్లా కేంద్రం కావాలనే వుంటుంది. కానీ అది సాధ్యం కాదు కదా? మరి అమరావతి రాజధాని చేసినపుడు విశాఖ వాసులకు బాధ వుండదా? మరి ఇదే మీడియాకు అప్పట్లో ఆ బాధ కనిపించలేదా? 

మండలాల ఏర్పాటు రోజులు ఓసారి గుర్తు తెచ్చుకోవాలి. తమ ఊరిని మండల కేంద్రంగా చేయాలని, తమ ఊరు మండల కేంద్రానికి దూరంగా వుందని ఆందోళనలు జరగలేదా? అలా అని ఎన్టీఆర్ తన ప్రయత్నాన్ని పక్కన పెట్టారా? సమితులను వికేంద్రీకరించి మండలాలను చేయడం మంచిదే అని కాలానుగుణంగా రుజువు అయింది కదా? మరి అదే విధంగా 13 జిల్లాలను వికేంద్రీకరించడం అన్నది మంచిదే అన్న విషయం కుల పిచ్చతో కళ్లు మూసుకున్న ఈ మీడియాకూ తెలుసు. కానీ అంగీకరించలేదు. అంతే.