మాణిక్కం ఠాగూర్‌కి రూ.25 కోట్లు ఇచ్చి….

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి నియామ‌కం త‌ర్వాత తెలంగాణ‌లో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. రాళ్ల‌తో కొట్టాల‌ని రేవంత్‌రెడ్డి అంటే, అందుకు కౌంట‌ర్‌గా చెప్పుల‌తో కొడ‌తాం అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మొత్తానికి కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి నియామ‌కం…

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి నియామ‌కం త‌ర్వాత తెలంగాణ‌లో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. రాళ్ల‌తో కొట్టాల‌ని రేవంత్‌రెడ్డి అంటే, అందుకు కౌంట‌ర్‌గా చెప్పుల‌తో కొడ‌తాం అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మొత్తానికి కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి నియామ‌కం జోష్ పెంచ‌గా, టీఆర్ఎస్‌లో అస‌హ‌నం చోటు చేసుకుంది.

పార్టీ ఫిరాయించిన వారిని రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు దీటైన కౌంట‌ర్ ఇచ్చారు. ఎల్బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నోరుంది క‌దా అని ఏదైనా మాట్లాడితే స‌హించ‌మ‌ని హెచ్చ‌రించారు. 

రేవంత్‌రెడ్డి పార్టీ మారిన వాళ్ల‌ని రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని అంటున్నాడ‌ని, మీరు రాళ్ల‌తో కొడితే తాము చెప్పుల‌తో కొడ‌తామ‌ని తీవ్రంగా హెచ్చ‌రించారు. టీపీసీసీ ప‌ద‌వి రాక‌పోతే రేవంత్‌రెడ్డి పార్టీ మారే వారు కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తాము రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం టీఆర్ఎస్‌లో వీలినం చేశామని చెప్పుకొచ్చారు. త‌మ‌వి సేవా రాజకీయాలని, నీవి స్వార్థ రాజకీయాలు అని రేవంత్‌రెడ్డిపై ధ్వ‌జ‌మెత్తారు.  తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్‌కి రూ. 25 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నావ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ తమ గురించి మాట్లాడటం ఏమిటంటూ ఆయ‌న గ‌ట్టిగా ప్రశ్నించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాళ్లతో కొట్టి చంపండి అనేది రాజ్యాంగంలో ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పార్టీలు మారితే సంసారం, ఇక్కడ మారితే వ్యభిచారమా అని ఆయ‌న నిల‌దీశారు. రాజాంగ్యం ప్రకారమే తాము టీఆర్ఎస్‌లో విలీనమయ్యామని వెంకటరమణారెడ్డి తెలిపారు.

రేవంత్ 2017లో టీడీపీ నుంచి పార్టీ మారి పదవి కాలం ముగిసే వరకు ఎమ్మెల్యే‌గా కొనసాగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి అలాంటి భాష వాడొచ్చా అని గండ్ర‌ ప్ర‌శ్నించారు. టీడీపీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ను మొదట రాళ్లతో కొట్టాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చ రించారు. ఉన్నత పదవులు వస్తే గౌరవం పెంచుకోవాలని హిత‌వు ప‌లికారు. చిల్లర మాటలు మాట్లాడొద్దని సూచించారు.