హర్యానా ఎన్నికల ప్రచార సభల్లో నరేంద్రమోడీ ఒకే అంశాన్నిప్రస్తావిస్తూ వస్తున్నారు. జమ్మూ కశ్మీర్ విషయంలో ఉండిన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్నే ఈ ఎన్నికల అజెండాగా మార్చారు మోడీ. తాము ఆ ఆర్టికల్ ను రద్దు చేయడంతో కొన్ని పార్టీలు బాధపడుతూ ఉన్నాయని మోడీ ప్రచారంలో పేర్కొంటున్నారు. అంతటితో ఆగడంలేదు. చేతనైతే ఆ ఆర్టికల్ ను తిరిగి తెస్తామంటూ ప్రకటించాలని తన ప్రత్యర్థి పార్టీలకు మోడీ సవాల్ విసురుతూ ఉండటం గమనార్హం!
అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెన్టీని రద్దుచేసి నెలలు గడుస్తున్నా జమ్మూకశ్మీర్లో ఇప్పటికీ సాధారణ పరిస్థితి ఏర్పడటం లేదని ఒక ప్రచారం ఉంది. ఇప్పటి వరకూ అక్కడి ప్రాంతీయ పార్టీల నేతలను బయటకు వదలడం లేదని, వాళ్లను ఇళ్లకే పరిమితం చేసి హౌస్ అరెస్ట్ చేశారని, ఢిల్లీలోని జమ్మూ కశ్మీర్ నేతలను ఇప్పటి వరకూ రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వడం లేదని తెలుస్తోంది. ఇలా ఎన్ని రోజులు నిర్భంధిస్తారు? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.
జమ్మూ కశ్మీర్ లో ఇప్పటికీ పరిస్థితులను ప్రభుత్వం కూడా సడలించలేదని అధికారికంగానే స్పష్టం అవుతోంది. అయితే ఆ అంశాన్ని మోడీ ఎన్నికల కోసం అయితే బాగానే వాడుకుంటున్నారు. ఆర్టికల్ గురించినే మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రత్యర్థులు కూడా అదే అంశం గురించి మాట్లాడాలంటూ ఆయన సవాళ్లు విసురుతూ ఉన్నారు!