తండ్రి దొంగ అయినంత మాత్రానా కూతురు దొంగ కావాలని లేదు… అని వాదిస్తే ఒక లెక్క. అయితే మోడీ భక్తాగ్రేసరులు మాత్రం మరో టైపు! మోడీ దీపాలు పెట్టమని, చప్పట్లు కొట్టమన్నప్పుడు.. కరోనా విరుగుడుకూ ఆ చప్పట్లకు ముడిపెట్టి ..అదేదో శక్తి ఉత్పత్తి అవుతుందని, అది కరోనాను నాశనం చేస్తుందని లాజిక్ లు తీసిన మేధావులు వాళ్లు. అంతరిక్ష శక్తి- అతీంద్రియ శక్తి అంటూ.. వాట్సాప్ లో అప్పట్లో ఫార్వర్డులు మామూలుగా లేవు! మోడీ ఏం చేసినా దాన్నొక మాస్టర్ స్ట్రోక్ గా అభివర్ణిస్తూ వాట్సాప్ ఫార్వార్డ్ లు చేయడమే పనిగా కొందరుంటారు.
ఇలాంటి క్రమంలో వీరప్పన్ ను వీర దేశభక్తుడిగా చూపడం మొదలైంది! ఎందుకంటే.. వీరప్పన్ కూతురుకు తమిళనాడులో బీజేపీ యూత్ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు కదా, అందుకనమాట! మామూలుగా అయితే వీరప్పన్ ను సమర్థించాల్సిన అవసరం బీజేపీకి లేదు. అయితే వీరప్పన్ వంటి దొంగ కూతురుకు బీజేపీ పదవిని ఇవ్వడమా అనే విమర్శలు వస్తున్నాయి. వీరప్పన్ బతికి ఉంటే ఆయనకూ బీజేపీ సభ్యత్వం ఇచ్చి నేతను చేసేదని కాంగ్రెస్ వాళ్లు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. దీంతో అర్జెంటుగా వీరప్పన్ ను వీర దేశభక్తుడిగా మార్చేపనిలో ఉన్నారు సోషల్ మీడియాలోని మోడీ భక్తులు.
వీరప్పన్ ప్రాణం తీయించి, దంతాలు కోసిన వంద ఏనుగుల మీదొట్టు, వీరప్పన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన 150 మంది మీదొట్టు.. వీరప్పన్ నరోత్తముడు అని, వీరప్పన్ కు మించిన దొంగలెంతో మంది ఉన్నారని, వారందరినీ వదిలేసి వీరప్పన్ ను నిందించడం భావ్యం కాదని.. వీరప్పన్ అడవుల్లో బతికాడని, ఎలాంటి సుఖాలనూ అనుభవించలేదని..ఇలా వీరప్పన్ లోని ఉత్తమ గుణాల గురించి పువ్వు పార్టీ వాళ్లు ప్రచారం మొదలుపెట్టారు. రేపోమాపో వీరప్పన్ కు ఏ పద్మశ్రీనో, పద్మభూషణో ఇవ్వాలని.. ఆయన గొప్పదనం గురించి ఏకరువు పెడుతూ వాట్సాప్ ఫార్వార్డులు ఊపందుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో! సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీల్లో మోడీ భక్తుల మేధోతనం దేన్నైనా నిరూపించగలదు!