మూలిగే రైతుల‌పై .. మోడి ప్ర‌భుత్వం తాటికాయ‌లు!

భ‌విష్య‌త్తులో ఇండియాలో వ్య‌వ‌సాయం చేసేవాడుంటాడా? అనేది అతి పెద్ద చ‌ర్చ‌నీయాంశం. ఈ దేశంలో ఏ ప‌ని చేసినా లాభ‌మే, వ్య‌వ‌సాయం త‌ప్ప‌! అనే ప‌రిస్థితి ఇప్పుడు కొన‌సాగుతూ ఉంది. ఒక్క ఎక‌రం పంట‌కు ముప్పై…

భ‌విష్య‌త్తులో ఇండియాలో వ్య‌వ‌సాయం చేసేవాడుంటాడా? అనేది అతి పెద్ద చ‌ర్చ‌నీయాంశం. ఈ దేశంలో ఏ ప‌ని చేసినా లాభ‌మే, వ్య‌వ‌సాయం త‌ప్ప‌! అనే ప‌రిస్థితి ఇప్పుడు కొన‌సాగుతూ ఉంది. ఒక్క ఎక‌రం పంట‌కు ముప్పై నుంచి న‌ల‌భై వేల రూపాయ‌ల పై మొత్తం పెట్టుబ‌డి అవుతోంది. దిగుబ‌డి దైవాధీనం, ఆ పై మ‌ద్ద‌తు ధ‌ర.. కేవ‌లం భ్ర‌మ‌!

ఎన్నో వేల హెక్టార్ల‌లో పంట న‌ష్టం జ‌రిగితే, ఆ స‌మ‌యంలో పంట పండించుకున్న రైతుకు గిట్టుబాటు ధ‌ర ద‌క్కుతోంది.  మీడియాలో మంచి ధ‌ర పొందుతున్న రైతు గురించి రాస్తారు కానీ, అదే సంవ‌త్స‌రం అదే పంట సాగు చేసి న‌ష్ట‌పోయిన వాడి గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు.

ఉల్లి ధ‌ర పెరిగినా, ట‌మోటా ధ‌ర కిలో వంద రూపాయ‌లు ప‌లికినా.. దాన్ని ఆ సీజ‌న్ లో సాగు చేసిన వారంతా లాభ‌ప‌డ్డార‌ని అనుకోవ‌డం అమాయ‌క‌త్వం. గ‌త ఏడాది భారీ వ‌ర్షాల‌కు కొన్ని వేల హెక్టార్ల‌లో ట‌మోటా పంట నాశ‌నం అయ్యింది. ఆ ప‌రిస్థితుల్లో ఎలాగోలా కొద్దో గొప్పో దిగుబ‌డి పొందిన వారికి మాత్రం ధ‌ర‌తో లాభాలు వ‌చ్చాయి. 

యాభై శాతానికి మించి రైతులు న‌ష్ట‌పోతే, మిగిలిన యాభై శాతం మందికి ధ‌ర ద‌క్కింది. అదే అంద‌రూ దిగుబ‌డి సాధిస్తే… అంద‌రికీ న‌ష్ట‌మే! ఇంత దుర్మార్గ‌మైన స‌మీక‌ర‌ణాల మీద సాగుతోంది దేశంలో వ్య‌వ‌సాయం. మ‌రి ఈ ప‌ని ఎవ‌రైనా ఎన్నేళ్లు చేస్తారు? ఎందుకు చేస్తారు? అందుకే సాగు క‌న్నా.. వేరే ప‌నుల మీదే నూత‌న త‌రాలు ఆధార‌ప‌డుతున్నాయి. దీంతో సేద్యం భ‌వితవ్యం ప్ర‌శ్నార్థ‌కం అవుతోంది.

మ‌రి పండించే వాడే లేక‌పోతే రేపు వ‌చ్చే ఆహార కొర‌త మాటేంటి? ఏ దేశం నుంచి ఆహారాన్ని దిగుమ‌తి చేసుకుంటారు ఇంత పెద్ద దేశానికి? అనే ప్ర‌శ్న‌ల‌ను ఎంద‌రో మేధావులు కూడా ప్ర‌స్తావించ‌డం లేదు. ఎంత‌సేపూ సాఫ్ట్ వేర్ ఔట్ సోర్సింగ్ గురించి, మేకిన్ ఇండియా మాట్లాడ‌తారు కానీ, వ్య‌వ‌సాయం ఏమ‌వుతోంద‌నే దాని గురించి మాట్లాడేవాడు లేడు! ఆ మేకిన్ ఇండియా కూడా ఒట్టి నినాదం మాత్ర‌మే. గొప్ప ప‌రిశ్ర‌మ‌ల‌తో యువ‌త‌కు ఉపాధి దొరికే ప‌రిస్థితి కూడా లేదు!

ఇదే ధైన్యం అనుకుంటే.. వ్య‌వ‌సాయదారుల‌పై మోడీ ప్ర‌భుత్వం త‌న క‌క్ష పూరిత ధోర‌ణిని కొన‌సాగిస్తూ ఉంది. ఇప్ప‌టికే మోడీ ప్ర‌భుత్వాన్ని శ‌త్రువుల్లా చూస్తున్నారు రైతులు. అందుకేనేమో బ‌డ్జెట్ లో ఎరువుల‌పై రాయితీల‌ను మ‌రింత‌గా ఎత్తేశారు! మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్పుడు ఎరువులు, ర‌సాయ‌నాల మీద స‌బ్సీడీల ఎత్తివేత మొద‌లైంది. ఆ ఎత్తివేత‌లు చేసి.. రైతుల ఖాతాల్లోకి ఏడాదికి రెండు వేల రూపాయ‌లు అంటూ ప్ర‌క‌టించారు.

మోడీ వ‌చ్చాకా.. ఎరువుల ధ‌ర‌లు ఆకాశానికి అంటాయి. ఆయ‌న ఇచ్చే రెండు వేల రూపాయ‌ల‌తో రెండు యూరియా మూట‌లు కూడా రావు! ఒక ఎక‌రం సాగు చేసే రైతు.. ప్ర‌స్తుతం ఎరువులూ, పురుగుమంద‌ల కోసం ఇర‌వై ముప్పై వేల రూపాయ‌లు పెట్టాలి. వాణిజ్య పంట‌ల సాగులో అయితే.. ఇది ఇంకా ఎక్కువ‌! ఇక తాజా బ‌డ్జెట్ లో ఎరువుల‌పై స‌బ్సీడీ మొత్తాల‌కు కేంద్రం వెచ్చించే వ్య‌యాన్ని మ‌రింత‌గా త‌గ్గించేశారు. 

యూపీఏ హ‌యాంలో ఎరువుల‌పై అనేక స‌బ్సిడీలు ఉండేవి. అలాగే వ్య‌వ‌సాయోప‌క‌ర‌ణాల మీద కూడా. అయితే.. ఇప్పుడు స్ప్రింక్ల‌ర్లు, డ్రిప్ ఇరిగేష‌న్ ప‌రిక‌రాల రేట్లు కూడా.. భారీ స్థాయికి చేరాయి. బిందు సేద్యాన్ని ప్రోత్స‌హించి వ్య‌వ‌సాయానికి అండ‌గా నిలవాల్సిన ప్ర‌భుత్వం.. అస‌లే మూలుగుతున్న రైతుల‌ మీద తాటికాయ‌లు వేసే నిర్ణ‌యాల‌ను తీసుకుంటుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని, ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది.