ప్ర‌జ‌ల క‌ష్ట‌కాలంలో.. మోడీ సెల్ఫ్ గోల్ చేసుకున్నారా?

మోడీ చెప్పిన జ‌న‌తా క‌ర్ఫ్యూను, లాక్ డౌన్ ను జ‌న‌సామాన్యం పాటిస్తూ ఉంది, ఇందుకు ప్ర‌తిగా ఆయ‌న ప్ర‌జ‌లకు ఇచ్చింది ఏమిటి? అంటే.. చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం, దీపాలు పెట్ట‌డం అనే టాస్కులు. ఇప్ప‌టికే ఈ…

మోడీ చెప్పిన జ‌న‌తా క‌ర్ఫ్యూను, లాక్ డౌన్ ను జ‌న‌సామాన్యం పాటిస్తూ ఉంది, ఇందుకు ప్ర‌తిగా ఆయ‌న ప్ర‌జ‌లకు ఇచ్చింది ఏమిటి? అంటే.. చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం, దీపాలు పెట్ట‌డం అనే టాస్కులు. ఇప్ప‌టికే ఈ లాక్ డౌన్ ప‌ట్ల సామాన్య ప్ర‌జ‌లు అస‌హ‌నంతో కాగిపోతున్నారు. ఎవ‌డో ఏదో వ్యాధుల‌ను అంటించుకుని వ‌స్తే త‌మ జీవితాలు ఇలా అయిపోవ‌డం ఏమిట‌నే బాధ వాళ్ల‌లో ఉంది. అయితే వాళ్లు ఏం చేయ‌లేని ప‌రిస్థితి. మూలిగే న‌క్క మీద తాటి పండు ప‌డ్డ‌ట్టుగా..మోడీ మ‌హాశ‌యులు ఏవేవో టాస్కులు ఇస్తున్నారు. ఇలాంటి టాస్కులు ఏ బిగ్ బాస్ హౌస్ లో ఉండే బ‌లిసిన బ్యాచ్ కు వినోదాన్ని ఇస్తాయేమో కానీ, జీవిత‌మే చింద‌రవంద‌ర అయిపోతున్న దాఖ‌లాలు క‌నిపిస్తుండ‌టంతో.. స‌గ‌టు భార‌తీయులు ఈ టాస్కుల‌ను పాటించే ప‌రిస్థితుల్లో లేరు.

ల‌క్షా డెబ్బై వేల కోట్ల రూపాయ‌ల సాయం అంటూ కేంద్రం ఒక ప్ర‌క‌ట‌న చేసింది. అయితే ఆ సాయం ఇప్ప‌టి వ‌ర‌కూ సామాన్యుడికి అందింది ఏముంది? అవ‌త‌ల రాష్ట్రాలు మ‌మ్మ‌ల్ని బ‌య‌టి నుంచి అయినా అప్పులు తెచ్చుకోనివ్వండి అంటూ కేంద్రాన్ని విన్న‌విస్తున్నాయి. 

ఈ రోజు సాయంత్రం దీపాలు పెట్టి సంబ‌రాలు, సంఘీభావాలు ప్ర‌క‌టించే వారు ఉండ‌నే  ఉంటారు. సినిమా వాళ్లు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నేత‌లు.. మోడీ భ‌క్తాగ్రేస‌రులు.. వీళ్లంతా ఈ రోజు చేసే హ‌డావుడి మామూలుగా ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే ఇదే స‌మ‌యంలో వ‌ల‌స కూలీలు, సంచార జీవుల ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇల్లిళ్లూ తిరిగి వారు అడుక్కుతింటున్నారు.

పూట‌కు ఇంత బువ్వ కోసం వంద‌ల కిలోమీట‌ర్ల అవ‌త‌ల‌కు వెళ్లి, చిన్నా చిత‌క ప‌నులు చేసుకుంటూ..బ‌తుకీడ్చేవారు ఆ ప‌నులు లేక‌, పూట‌కింత బువ్వ లేక ఇంటింటికీ తిరుగుతూ.. అడుక్కుంటున్నారు.  అలాంటి వారి ఉద్ధ‌ర‌ణ‌కు స్థానికంగా ఎవ‌రైనా కాస్త స్పందిస్తున్నారేమో కానీ, కేంద్రం ఏం చేసింది? క‌బుర్లు చెప్ప‌డ‌మా? మోడీ ఏం చేశారు? ఇళ్ల ద‌గ్గ‌ర పొద్దుపోని జ‌నాల‌కు టైమ్ పాస్ టాస్కులు ఇవ్వ‌డ‌మా?

భ‌క్తుల దృష్టిలో, ముదిరిపోయిన హిందుత్వ వాదుల దృష్టిలో, బీజేపీ లెక్క‌లో.. ఈ దీపాలు కూడా మాస్ట‌ర్ స్ట్రోకే కావొచ్చు, అయితే ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వారి వైపు నుంచి చూస్తే.. ఇది మోడీ చేసుకున్న సెల్ఫ్ గోల్.

గుర్తుంచుకోండి ఈ ఆదివారం రాత్రి 9 గంటలకి