టీడీపీ కూటమి నెలన్నర పాలన మీద ఇది ఒక విశ్లేషణ. చేసింది వైసీపీకి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ఆమె ప్రశ్నించారు. ఆడపిల్లలకు మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని ఆమె విమర్శించారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత గడచిన 40 రోజుల్లో.. రోజూ మూడు హత్యలు ఆరు రేప్‌లు అన్నట్లుగా పరిస్థితి మారిందని వరుదు కల్యాణి ఫైర్ అయ్యారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కానీ ఎక్కడా స్పందించడం లేదని ఆమె విమర్శించారు.
ఎంతసేపూ వైసీపీ శ్రేణుల మీద దాడులు చేయదం తప్ప శాంతి భద్రతల గురించి పట్టించుకునే పరిస్థితి ఉందా అని ఆమె నిలదీశారు. వరసగా జరుగుతున్న అత్యాచారాలతో ఆడపిల్లలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని ఆమె అన్నారు.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో పన్నెండు రోజులు గడిచినా చిన్నారి మృతదేహాన్ని కనిపెట్టలేక పోయారంటే ప్రభుత్వ చేతగానితనం అందరికీ అర్ధం అవుతోందని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బుల్డోజర్ సంస్కృతి వచ్చిందని ఆమె అన్నారు. వైసీపీ ఆఫీసులు, నాయకుల బిల్డింగులను కూల్చడం పైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతోందని, అదే సమయంలో ఆడపిల్లలను ఇంత దారుణంగా హత్యలు, అత్యాచారాలు చేస్తున్న వారి మీద ఈ ప్రభుత్వం,అవే బుల్డోజర్లు ఎందుకు ఉపయోగించడం లేదని ఆమె నిలదీశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, అంబానీ ఇంట పెళ్లికి వెళ్లారని రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే వాళ్ల ఇంటికి పరామర్శకు వెళ్లాలని ఎందుకు అనిపించలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. సాక్ష్తాత్తూ హోం మంత్రి నియోజకవర్గంలో ఇద్దరు మహిళల బట్టలు చించి టీడీపీ నాయకులు వారిని రోడ్డుపై ఈడ్చారని అదే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలంలో ఒక అమ్మాయిని గొంతు కోసి చంపేశారని కళ్యాణి అన్నారు.
హోం మంత్రి ఇస్తున్నవి ఉత్త స్టేట్ మెంట్లు తప్ప ఎక్కడా కార్యాచరణ లేదని వరుదు కళ్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారని మరి మహిళలు, ఆడ పిల్లల మీద ఈ హత్యలు, అత్యాచారాలపై ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఆడపిల్లల రక్షణ అనేది మీకు ప్రాధాన్య అంశం కాదా వారి కోసం కఠినమైన చట్టాలు తీసుకురారా? అని ప్రశ్నించారు. వీటన్నింటిపై ప్రభుత్వం స్పందించకపోతే, ప్రజా పోరాటాలకు సిద్ధం అవుతామని వరుదు కళ్యాణి ప్రకటించారు.
Comments are closed.