హీరో, హీరోయిన్ల‌కు ముద్ర‌గ‌డ ఝ‌ల‌క్‌!

సినిమా టికెట్ల‌ను ఏపీ ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌లో విక్ర‌యించాల‌నే నిర్ణ‌యంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో, కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రో ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. మాజీ ఎగ్జిబిట‌ర్‌గా త‌న‌ను…

సినిమా టికెట్ల‌ను ఏపీ ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌లో విక్ర‌యించాల‌నే నిర్ణ‌యంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో, కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రో ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. మాజీ ఎగ్జిబిట‌ర్‌గా త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకుంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి బ‌హిరంగ లేఖ రాయడం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఆయ‌న లేఖ‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే, నిర్మాత‌లకు అనుకూలంగా రాసిన‌ట్టుంది. అలాగే హీరో, హీరోయిన్ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్టుగా చెబుతున్నారు. ఇంత‌కూ ఆయ‌న లేఖ‌లో ఏముందంటే…

సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానం చాలా మంచిదని ముద్రగడ అభిప్రాయ‌ప‌డ్డారు. చిత్ర నిర్మాణం కోసం నటించే హీరో, హీరోయిన్లు మొదలుకొని ఆ సినిమాకు భాగమయ్యే ప్రతి ఒక్కరికి ఇచ్చే కిరాయిని, అలాగే కేరావేన్లు, ఇతర వాహనాలకు, రూమ్ అద్దెలకు, టిఫిన్లు, భోజనాలు వగైరా అన్నింటికి అయ్యే ఖర్చు నిర్మాత దగ్గర నుంచి ముందే మొత్తం డబ్బును ప్రభుత్వం జమ చేయించుకోవాల‌ని సూచించారు. 

ఆన్‌లైన్‌ టిక్కెట్లు మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలకు పంపించే ప్రణాళిక చేస్తే బాగుంటుందని ప్ర‌భుత్వానికి ముద్ర‌గ‌డ సూచించారు. దీని వ‌ల్ల దుబారా, ఎగ‌వేతలు ఉండ‌వ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌తి పైసా ఖ‌ర్చు వివ‌రాలు అద్దంలో చూసుకున్న‌ట్టు వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. దీని వల్ల నలుపు, తెలుపు ధనం అనే మాట వినబడదని తెలిపారు. పూర్తిగా తెలుపు డ‌బ్బుతోనే వ్యాపారం సాగు తుంద‌ని వెల్ల‌డించారు. దీనివ‌ల్ల‌ చిత్ర నిర్మాణానికి కూడా ఖర్చు తగ్గుతుందని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.

హీరో, హీరోయిన్లు తీసుకునే మొత్తానికి, పైకి చెబుతున్న మొత్తానికి ఎంతో తేడా ఉంటుంద‌ని ముద్ర‌గ‌డ చెప్ప‌క‌నే చెప్పారు. దీని వ‌ల్ల నిర్మాత‌కు సినిమా ఖ‌ర్చు త‌డిసి మోప‌డ‌వుతుంద‌ని ఆయ‌న ఆవేద‌న ఆ లేఖ‌లో క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఎలాగైనా హీరో, హీరోయిన్ల‌కు ఆర్థిక‌ప‌రంగా ముకుతాడు వేయాల‌నే ప‌ట్టుద‌ల ముద్ర‌గ‌డ లేఖ‌లో ప్ర‌తిబింబిస్తోంది. ముద్ర‌గ‌డ లేఖ‌పై ఒక్క సినీ హీరో, హీరోయిన్ల వైపు నుంచి మిన‌హా, మిగిలిన విభాగాల నుంచి సానుకూలత వ్య‌క్త‌మ‌వుతోంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.