ఉప రాష్ట్రపతి. రాజ్యాంగ బద్ధమైన పదవి అది. రాజకీయాలకు అతీతమైన సమున్నత స్థానం అది. అయితే ఆ పదవిలో ఉన్నది తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు. పైగా ఆయనకు విశాఖతో చిరకాల అనుబంధం ఉంది. ఆయన యూనివర్శిటీ విద్యార్ధి దశతో పాటు, ఎమర్జెన్సీ ఉద్యమాల్లో పాల్గొనడం అన్నీ కూడా విశాఖలోనే జరిగాయి.
దాంతో విశాఖకు వెంకయ్యనాయుడుకు ఉన్న అనుబంధాన్ని ఇపుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు గుర్తు చేస్తూ ప్రైవేట్ కాకుండా కాపాడాలని కోరుతున్నారు. ఆయన కనుక చొరవ తీసుకుంటే ఈ ముప్పు తప్పుతుందని అంటున్నారు.
దీని మీద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా చెప్పుకొచ్చారు. ఆయన కేంద్రానికి నచ్చచెప్పి ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కుని కాపాడాలని కోరారు.
అదే టైమ్ లో మిజోరాం గవర్నర్ గా నియమితులైన హరిబాబుని కూడా నారాయణ ఇదే విషయమై కోరడం విశేషం. స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో ఉంచితేనే మిజోరాం గవర్నర్ గా మీరు వెళ్ళండి. లేకపోతే ఆ పదవి వద్దు అని చెప్పేయండి అంటూ నారాయణ ఆయన్ని కోరి మరీ ఇరకాటంలో పెట్టేశారు.
మొత్తానికి రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్న ఈ ఇద్దరు నేతల మీద కూడా స్టీల్ ప్లాంట్ వత్తిడి బాగానే పడుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.