దిశ హత్యకేసుకు సంబంధించి ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాల్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పరిశీలించారు. ఏడుగురు సభ్యుల బృందం ముందుగా మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి చేరుకొని మృతదేహాల్ని పరిశీలించారు. కొన్ని ఫొటోలు తీసుకున్నారు. తర్వాత గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ ఆఫీసర్ ను విచారించారు. ప్రోటోకాల్ ప్రకారమే పోస్టుమార్టం జరిగిందా లేదా అని అడిగారు.
ఈ తతంగం ముగిసిన వెంటనే కమిషన్ సభ్యులు చటాన్ పల్లి చేరుకున్నారు. ముందుగా దిశను అత్యాచారం చేసిన ప్రదేశం, ఆ తర్వాత ఆమెను పెట్రోల్ పోసి కాల్చిన ప్రదేశాల్ని పరిశీలించిన కమిషన్ సభ్యులు.. అట్నుంచి అటు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. కమిషన్ సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు శంషాబాద్ డీఎస్పీ ప్రతాప్ రెడ్డి సమాధానాలిచ్చారు. జరిగిన ఘటన నుంచి ఎన్ కౌంటర్ వరకు ప్రతి విషయాన్ని సభ్యులకు వివరించారు.
నిందితుల పోస్టుమార్టమ్ కు సంబంధించిన నివేదిక రావడానికి మరో 2 రోజులు పడుతుంది. ఆ తర్వాత ఆ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించాలా లేక నేరుగా మానవ హక్కుల కమిషన్ కు ఇవ్వాలా అనే విషయాన్ని నిర్ణయిస్తారు. మృతిచెందిన నిందితులు నలుగురి మృతదేహాల్ని 9వ తేదీ రాత్రి 8 గంటల వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.