రెడ్ల‌కే మంత్రి ప‌ద‌వులుః డిప్యూటీ సీఎం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌పై డిప్యూటీ సీఎం కె.నారాయ‌ణ‌స్వామి మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. బాబు సొంత జిల్లాకు చెందిన నారాయ‌ణ‌స్వామి మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. నారాయ‌ణ‌స్వామి చెప్పిన అంశాలు సోష‌ల్…

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌పై డిప్యూటీ సీఎం కె.నారాయ‌ణ‌స్వామి మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. బాబు సొంత జిల్లాకు చెందిన నారాయ‌ణ‌స్వామి మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. నారాయ‌ణ‌స్వామి చెప్పిన అంశాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఒంటరిగా నిలబడి ఒక్క స్థానం గెలిచినా.. చంద్రబాబు ఇంట్లో తాను పాచి పని చేసేందుకు సిద్ధమని నారాయణ స్వామి సంచలన ప్రకటన చేశారు. తాను అవినీతికి పాల్ప‌డిన‌ట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేశార‌ని ఆరోపించారు. అలా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల్లో రెడ్లకు మాత్ర‌మే మంత్రి పదవులు ఇచ్చారని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. చంద్రబాబు హయాంలో ఒక్క ఎస్సీకైనా అవ‌కాశం కల్పించారా? అని ఆయ‌న నిల‌దీశారు. ఎస్సీల‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేనే లేవ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

గతంలో తనను కూడా టీడీపీలోకి లాక్కునేందుకు ఎంతో మందితో చంద్రబాబు బేరాలు ఆడించారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను డబ్బులకు, పదవులకు లొంగే వ్యక్తిని కాదనే విషయాన్ని అప్పట్లోనే నిరూపించానని డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి గుర్తు చేశారు.

ఇదిలా ఉండ‌గా ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఆదినారాయ‌ణ‌రెడ్డి, అమ‌ర‌నాథ‌రెడ్డి, భూమా అఖిల‌ప్రియ, సుజయ్‌ కృష్ణరంగారావుల‌కు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన సంగ‌తి తెలిసిందే. వీరిలో ఏ ఒక్క‌రూ 2019 ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేదు.