లేడీ కానిస్టేబుళ్ల దెబ్బ.. ఖంగుతిన్న దొంగలు

బీహార్‌ రాష్ట్రం హాజీపూర్‌ లోని సెందూరి చౌక్‌ లో ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంకు అది. ఆ బ్యాంక్ దగ్గర ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు కాపలా ఉన్నారు. ముగ్గురు దొంగల ముఠా పథకం ప్రకారం…

బీహార్‌ రాష్ట్రం హాజీపూర్‌ లోని సెందూరి చౌక్‌ లో ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంకు అది. ఆ బ్యాంక్ దగ్గర ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు కాపలా ఉన్నారు. ముగ్గురు దొంగల ముఠా పథకం ప్రకారం ఆ బ్యాంక్ ని దోచుకోవాలనుకుంది. ఒకరు బయట కాపలా ఉండి, ఇద్దరు లోపలికెళ్లి లాకర్లు కొల్లగొట్టుకుని రావాలనుకున్నారు.

సెక్యూరిటీగా లేడీ కానిస్టేబుళ్లు ఉండటంతో పని సులువవుతుందని అనుకున్నారు. ముసుగులు వేసుకుని తుపాకులు చేతిలో పట్టుకుని బ్యాంక్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే.. డబ్బులతో కాదు, దెబ్బలతో పరారయ్యారు.

ముగ్గురు ముసుగు వేసుకుని బ్యాంక్ లోపలికి రావడంతో వెంటనే లేడీ కానిస్టేబుళ్లు అలర్ట్ అయ్యారు. ఎవరు మీరు, బ్యాంక్ లోకి ఎందుకు వస్తున్నారు, మీ పాస్ బుక్ లు చూపించండి అన్నారు. పాస్ బుక్ లు లేవంటూ దొంగలు తుపాకీలు ఎక్కుపెట్టారు. సెక్యూరిటీగా ఉన్న జుహీ కుమారి, శాంతి కుమారి ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు.

ఇద్దరూ ఆడ శివంగుల్లా ఒక్క ఉదుటున దొంగలపైకి దూకారు. దొంగలు దాడికి దిగినా కూడా తలపడ్డారు. దొంగల చేతిలో తుపాకీ ఉందని తెలిసి కూడా పోరాటానికి వెనుకాడలేదు. తమ చేతుల్లో ఉన్న తుపాకీల్ని దొంగలు లాక్కోబోతుంటే, వాళ్లకు అందకుండా తుపాకుల్ని దూరంగా పెట్టారు.

రెప్పపాటులో ఎదురు దాడి..

ముగ్గురు దుండగులు మొహానికి మంకీ క్యాప్ లు వేసుకుని వచ్చారు, వారిని చూసి కస్టమర్లు భయపడ్డారు కానీ ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు మాత్రం భయపడకుండా రెప్పపాటులో స్పందించారు. వారి ధైర్యాన్ని పోలీసులు మెచ్చుకున్నారు. దుండగుల చేతుల్లో ఉన్న తుపాకీలు పేలకుండా కానిస్టేబుళ్లు ప్రదర్శించిన ధైర్య సాహసాలు అసమాన్యం అని కొనియాడారు.

తుపాకులు పేలి ఉంటే కస్టమర్లు భయపడేవారని, గందరగోళ వాతావరణం నెలకొని ఉండేదని, ప్రాణ నష్టం సంభవించేదని అన్నారు. జుహీ కుమారి, శాంతి కుమారికి రివార్డు ప్రకటించారు.