11 రోజులు.. 25 లక్షల మంది భక్తులు

అయోధ్యలో కొలువుదీరిన బాలక్ రామ్ ను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భవ్య రామమందిరానికి బారులు తీరుతున్నారు. జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పట్నుంచి భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 25…

అయోధ్యలో కొలువుదీరిన బాలక్ రామ్ ను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భవ్య రామమందిరానికి బారులు తీరుతున్నారు. జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పట్నుంచి భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 25 లక్షలకు చేరుకుంది.

11 రోజుల్లో 25 లక్షల మంది భక్తులు రాముడ్ని దర్శించుకున్నట్టు రామజన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. ప్రస్తుతం రోజుకు 2 లక్షల మంది భక్తులు దేవాలయాన్ని దర్శిస్తున్నారని, వాళ్ల కోసం దర్శన వేళల్లో మార్పులు చేసినట్టు తెలిపారు.

మరోవైపు రామాలయానికి భారీగా విరాళాలు వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన విరాళాలు 11 కోట్ల రూపాయలు దాటినట్టు ట్రస్ట్ ప్రకటించింది. ఆలయంలో ఏర్పాటుచేసిన హుండీల్లో 8 కోట్ల రూపాయలు జమ అవ్వగా.. మిగతా మొత్తం ఆన్ లైన్ డొనేషన్ల రూపంలో వచ్చిందని తెలిపింది.

భక్తులు కానుకలు సమర్పించేందుకు ఆలయంలో పెట్టిన హుండీల సంఖ్యను తాజాగా పెంచారు. ప్రస్తుతం ఆలయంలో 4 భారీ హుండీలు ఏర్పాటుచేశారు. రాముడ్ని దర్శించుకునే మార్గంలో, విగ్రహానికి దగ్గరగా ఈ హుండీలు ఏర్పాటు చేశారు.

ఈ కానుకల్ని లెక్కించేందుకు ప్రతి రోజూ 14 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీళ్లలో వివిధ బ్యాంకుల నుంచి 11 మంది సిబ్బంది ఉండగా, ట్రస్టు నుంచి ముగ్గురు ఉద్యోగులున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో వచ్చిన కానుకల్ని లెక్కించి, అదే రోజు బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. రానున్న వేసవిలో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని ట్రస్ట్ అంచనా వేస్తోంది.