యావత్ భారతదేశమంతా రామనామ స్మరణతో మార్మోగుతోంది. అయోధ్యలో రామాలయం నిర్మించుకోవాలనేది హిందువుల 500 సంవత్సరాల నాటి కల. ఆ కల సాకారం అవుతున్న వేళ సినీ, రాజకీయ, ఆధ్మాత్మిక… ఇలా అన్ని రంగాల ప్రముఖులు, సామాన్య ప్రజలు అయోధ్య బాట పట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు రామాలయ ప్రారంభ ఘట్టాన్ని టీవీల్లో వీక్షించేందుకు ఎదురు చూస్తోంది.
ఈ నేపథ్యంలో అద్భుత వేడుకకు ప్రధాన సూత్రధారి అయిన బీజేపీ కురువృద్ధుడు, మన దేశ మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ వెళ్లకపోవడం పెద్ద లోటే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆయన చలి కారణంగా అయోధ్యకు వెళ్లలేదని తెలిపారు. గతంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని దేశ వ్యాప్తంగా అద్వానీ రథయాత్ర చేపట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇవాళ బీజేపీ దేశ వ్యాప్తంగా విస్తరించిందంటే నాడు అద్వానీ చేపట్టిన రథయాత్రే కారణమని చెప్పొచ్చు. అప్పట్లో వాజ్‌పేయ్, అద్వానీ మాత్రమే బీజేపీలో అగ్రనేతలు. కేవలం రెండంటే రెండే లోక్‌సభ స్థానాలున్న బీజేపీ, ఆ తర్వాత కాలంలో సొంతంగా 2014లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదగడం వెనుక… వాజ్‌పేయ్, అద్వానీ కృషి వుంది. వాళ్లిద్దరూ బీజేపీ ఉన్నతికి ఒక్కో ఇటుక పేర్చుతూ వచ్చారు.
ఎల్‌కే అద్వానీ రథయాత్ర చేపట్టినప్పుడు, ఆయన నీడలా ప్రస్తుత ప్రధాని మోదీ ఉన్నారు. మోదీ అతివాద చర్యల్ని అద్వానీ సమర్థించేవారు. వాజ్‌పేయ్ మితవాద రాజకీయవేత్త. మోదీ మత రాజకీయాలను అంగీకరించే వారు కాదనే ప్రచారం ఉంది. అయితే బీజేపీ బలోపేతానికి మోదీ లాంటి వారి అవసరం ఎంతైనా వుందని అద్వానీ వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. ఏది ఏమైతేనేం నేడు మోదీ ఇటు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అత్యంత శక్తిమంతమైన నాయకుడు.