ప్రపంచాన్ని మాయదారి మహమ్మారి చుట్టేస్తున్న ప్రమాదకర పరిస్థితి. గత కరోనా అనుభవాల దృష్ట్యా మోదీ సర్కార్ తాజాగా అలర్ట్ కావడంతో పాటు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు శర వేగంగా పెరుగుతుండడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. మన దేశంలో కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందకుండా కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది.
జనం బాగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. చైనా, జపాన్, అమెరికా తదితర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా, మన దేశంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక మీదట ప్రతి వారం సమావేశమై కరోనా పరిస్థితులపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.
జాతీయ టాస్క్‌ఫోర్స్ అధినేత వీకే పాల్ మాట్లాడుతూ కరోనా కేసులపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశామన్నారు.
కొత్తవేరియంట్లను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్‌ను పరిశీలిస్తున్నట్టు వీకే పాల్ తెలిపారు. 18 ఏళ్లలోపు పైబడిన వాళ్లంతా వాక్సిన్ వేసుకోవాలని సూచించారు.