రాహుల్‌పై వేటు.. ఏకతాటిపై విపక్షాలు!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేయ‌డంపై కాంగ్రెస్ పార్టీతో పాటు విప‌క్షాలు భ‌గ్గుమ‌న్నాయి. కేంద్రాన్ని విమ‌ర్శించ‌డంతో పాటు రాహుల్ కు మ‌ద్ద‌తుగా నిలిచాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మ‌మ‌తా…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేయ‌డంపై కాంగ్రెస్ పార్టీతో పాటు విప‌క్షాలు భ‌గ్గుమ‌న్నాయి. కేంద్రాన్ని విమ‌ర్శించ‌డంతో పాటు రాహుల్ కు మ‌ద్ద‌తుగా నిలిచాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ల‌తో పాటు క‌మ్యూనిస్టు నేత‌లు సైతం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. రాహుల్ ఎపిసోడ్ తో ప్ర‌తిప‌క్షాలు అన్ని ఏక‌తాటిపై వ‌చ్చాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ .. రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు అనర్హత వేటు వేయడం నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో నేడు చీక‌టి రోజుగా అభివ‌ర్ణించారు. మోదీ పాల‌న ఎమ‌ర్జెన్సీని మించిపోతోంద‌ని విమ‌ర్శించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి , తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రసంగాలను బట్టి అనర్హత వేటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దిగజార్చారని మమత మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోంద‌ని ఆగ్రహాం వ్య‌క్తం చేశారు.

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ స్పందిస్తూ… ఒక చిన్న మాట అన్నందుకు రాహుల్ గాంధీ వంటి నేతపై వేటు వేయడం దారుణమని అన్నారు. కేవలం విమర్శనాత్మకంగా మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, వ్యక్తిగతంగా విమర్శించలేదని రాహుల్ కూడా వివరణ ఇచ్చారని చెప్పారు. రాహుల్ తో మాట్లాడానని, ఆయనకు తన సంఘీభావాన్ని ప్రకటించానని తెలిపారు. చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు.

కాగా 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన క్రమంలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్. “దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది” అంటూ అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. బీజేపీ తీవ్రంగా దీనిపై మండి పడింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు…రాహుల్‌కు శిక్ష విధించింది. దీంతో లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఆయనపై అనర్హత వేటు వేశారు.