ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు జైలు నుంచి విముక్తి లభించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అభియోగాలపై 2014, మే నెలలో మహారాష్ట్ర పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న సాయిబాబా జైల్లో తీవ్ర అవస్థ పడుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆయన నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనపై మోపిన అభియోగాలను నిరూపించే ఆధారాలు లేకపోవడంతో ముంబై హైకోర్టు కేసు కొట్టి వేసింది. దీంతో ఏడేళ్ల జైలుశిక్ష నుంచి ఆయనకు విముక్తి లభించినట్టైంది.
ప్రొఫెసర్ సాయిబాబా కేసులో అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద సాయిబాబాపై అభియోగాలు నమోదయ్యాయి. ఆయనకు ట్రయిల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. తమకు యావజ్జీవం విధించడాన్ని సవాల్ చేస్తూ 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు తీర్పును సాయిబాబా ముంబై హైకోర్టులో సవాల్ చేశారు. 2022లో ముంబై హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.
పోలీసులు వెంటనే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముంబై హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టి, సాయిబాబాకు షాక్ ఇచ్చింది. ఈ కేసుపై మరోసారి విచారించాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరోసారి విచారించిన హైకోర్టు, అదే తీర్పును పునరుద్ఘాటించడం విశేషం. జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా నిర్ధారిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా ప్రకటించడం విశేషం. దీంతో వారంతా నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా మానవ హక్కుల ఉద్యమకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.