Advertisement

Advertisement


Home > Politics - National

నితీశ్ పై కమలం.. పసలేని బురద!

నితీశ్ పై కమలం.. పసలేని బురద!

తమను ఛీకొట్టి తమ కూటమిని వీడి వెళ్లిపోయిన నితీశ్ కుమార్ పై ఇప్పుడు కమలదళం ఎదురుదాడి ప్రారంభించింది. తాము నెత్తిన పెట్టుకున్ని నాయకుడు.. తమ పార్టీని, తమతో మైత్రిని ఛీకొట్టి వెళ్లిపోతే అది చాలా అవమానకరం కదా! ఆ అవమానాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. ఇప్పుడు నానా మాటలూ పేలుతోంది.

బీహార్ ఎన్నికల తర్వాత.. ఎన్డీయే కూటమిలో బిజెపికి చాలా ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. సమర్థత, నిష్కళంకత లాంటి కితాబులు కట్టబెట్టి.. తక్కువ సీట్లు వచ్చిన పార్టీ సారథి అయినప్పటికీ.. జెడీయూ సారధి నితీశ్ కుమార్ కు సీఎం కిరీటం పెట్టిన కమలదళం.. ఇప్పుడు అదే నేతను బద్నాం చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే వారి విమర్శల్లోనే పసలేకపోవడం చిత్రం. 

బిజెపితో కటీఫ్ చెప్పిన తర్వాత.. నితీశ్ లాలూప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్లి మంతనాలు సాగించడం, తర్వాత తేజస్వీ యాదవ్ తో కలిసి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ ను ఉద్దేశించి.. ‘లాలూజీ మీ ఇంట్లోకి పాము దూరింది జాగ్రత్త’ అంటూసెటైర్లు వేస్తున్నారు బిజెపి నాయకులు. అయితే నితీశ్ కుమార్ పాము అనే సంగతి వీరికి ఇప్పుడే హఠాత్తుగా గుర్తుకు వచ్చిందా అనేది అందరికీ కలుగుతున్న అనుమానం. ఇన్నాళ్లూ ఆ పాముతోనే కమలదళం పడకను పంచుకున్నది కదా అనేది ప్రజల వెటకారం. తమ పక్కనుంచి దిగిపోగానే.. మంచినేత కాస్తా పాము అయిపోయాడా అనేది వారి నిలదీత.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బిజెపి ఎంపీ, బీహార్ కు గతంలో ఉపముఖ్యమంత్రిగా కూడా సేవలందించిన నాయకుడు సుశీల్ కుమార్ మోడీ చెబుతున్న మాటలు ఇంకా చిత్రంగా ఉన్నాయి. ఆర్జేడీతో బంధం పెట్టుకున్న నితీశ్ కుమార్ లాలూప్రసాద్ యాదవ్ అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకుని, ఆ పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తారట. అలా తాను బలపడతారట!

అసలు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం ఉంటే.. ఆర్జేడీనైనా, జెడియూనైనా చీల్చడానికి కమలదళం కత్తులు కటార్లు సిద్ధం చేసుకుంటూ ఉన్నదని లోకమంతా భావిస్తోంటే.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న సామెత చందంగా.. ఈ సుశీల్ కుమార్ మోడీ మాత్రం.. నితీశ్.. లాలూ పార్టీని చీలుస్తారని జోస్యం చెప్పడమే తమాషా! అయినా.. లాలూకూడా బిజెపి కి శత్రువే అయినప్పుడు.. ఆయన పార్టీని చీలిస్తే మాత్రం బిజెపికి చింత ఎందుకు? అనేది జనం సందేహం.

సుశీల్ కుమార్ మరో కామెడీ కూడా చేశారు. ఈ ఎపిసోడ్ కు ముందు బీహార్ నుంచి జెడియూ నేతలు తనను సంప్రదించి.. నితీశ్ ను ఉపరాష్ట్రపతిగా పంపాల్సిందిగా కోరారని అన్నారు. నితీశ్ ను ఉపరాష్ట్రపతి చేస్తే.. తనను బీహార్ సీఎంగా ఉండాలని కోరారని ఈ బీహారీ మోడీ వెల్లడించారు. 

ఇది మహా కామెడీగా కనిపిస్తోంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కీలక నాయకుడు, ఇంకా అధికార వైభవం వెలగబెడుతున్నవాడు.. బిజెపితో పొత్తుకు రాం రాం చెబితే.. రాబోయే ఎన్నికల తర్వాత విపక్షాల తరఫున ఏకంగా ప్రధాని అభ్యర్థి కావడానికి తగిన సమర్థత పుష్కలంగా ఉన్నవాడు అయిన నితీశ్ తరఫున దూతలు.. ఎలాంటి విలువాలేని, లూప్ లైన్ లాంటి ఉపరాష్ట్రపతి పోస్టు కోసం ఆరాటపడతారా? అనేది ప్రజల సందేహం.

పొత్తుబంధం వీడిపోయారు గనుక.. నితీశ్ ను బద్నాం చేయాలని బిజెపి ఆరాటపడడం సహజం. అయితే ఇలాంటి పసలేని బురద కాకుండా, మరింత క్రియేటవ్, కన్‌స్ట్రక్టివ్ విమర్శలను వారు వండుకుంటే బాగుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?