రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్టుగా మారిపోయింది వ్యవహారం. మరి వ్యవహారం ఇక్కడి వరకూ రావడానికి ప్రథమ ముద్దాయి సోనియాగాంధీనే. తమకు రాజకీయంగా ఎదురు తిరిగితే అంత వరకూ సొంత పార్టీలో పని చేసిన వారిని, పార్టీ ఉన్నతి కోసం పని చేసిన వారిని కూడా బద్నాం చేయడానికి వెనుకాడమని సోనియాగాంధీ గతంలో సందేశం ఇచ్చింది.
సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకున్న ఉచ్ఛనీఛాలు మరిచి కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించింది. అప్పుడు కూడా తీర్పులిచ్చిన వారికి రిటైర్మెంట్ అయిన వెంటనే పదవులు దక్కాయనే విషయాన్ని ఇప్పుడే మరిచిపోకూడదు!
అప్పటికి రాహుల్ ఇంకా బుద్ధి రాని పిల్లాడేమో! ఇప్పుడు తన విషయంలో జరుగుతున్నది చూసి రాహుల్ నిర్ఘాంతపోతూ ఉండవచ్చు! కోర్టులు, కేసులు, సీబీఐ, ఈడీ వంటి వాటితో రాజకీయ ప్రత్యర్థులను ఎలా ఆడుకోవచ్చో సోనియా, చిదంబరం వంటి వాళ్లు ఆట మొదలుపెట్టి చూపిస్తే.. మోడీ, అమిత్ షాలు వాటిని ఇంకా బాగా ప్రయోగిస్తున్నారని సగటు భారతీయుడు అనుకుంటున్నాడు!
ఎటొచ్చీ సోనియాగాంధీ, చిదంబరం చేసిన బాణామతి ప్రయోగాలు సొంత పార్టీని చిన్నాభిన్నం చేశాయి. బీజేపీ ఇప్పుడు డైరెక్టుగా కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీనే టార్గెట్ చేసింది. వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఆడుకుంటున్నారని ఇప్పుడు రాహుల్, సోనియాలు వాపోతే వారికి వారు చేసిందేమిటో గుర్తుకు రావాలి! అయితే వ్యవస్థలతో ఆడుకునేది ఎవరైనా.. ఆ తర్వాతి పర్యావసనాలకు కూడా రెడీగా ఉండాలని ఈ సందర్భంగా కమలదళం కూడా మరిచిపోకూడదు!
ఆ సంగతలా ఉంటే.. రెండేళ్ల జైలు శిక్ష వ్యవహారంలో రాహుల్ కు స్టే అయినా దక్కుతుందా? లేక ఆయన ఆ శిక్షను అనుభవించేసి రావాలని పై కోర్టులు స్పష్టం చేస్తాయా అనేది ఆసక్తిదాయకమైన అంశం! బీజేపీ అనుకున్న ప్రకారం అయితే రాహుల్ కు గడువులోగా స్టే దక్కే అవకాశాలు ఉండవనుకోవాలి! అంతలోపు వయనాడ్ సీట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు కూడా జరగిపోవచ్చు. ఎలాగూ లోక్ సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి.. ఉప ఎన్నికకు ఆస్కారం ఉంది! రాహుల్ కు న్యాయస్థానాల్లో ఊరట లభిస్తుందనేది నమశక్యం కాని అంశంగా నిలుస్తోంది.
బీజేపీ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. రాహుల్ కు ఇప్పుడప్పుడే లోక్ సభలో ఎంట్రీకి కూడా ఆస్కారం ఉండదు! రెండేళ్ల శిక్ష పై పై కోర్టు స్టే ఇవ్వడం, లేదా పూర్తిగా రద్దుకావాలి. ఈ రెండింటిలో ఏదైనా జరిగితే మాత్రమే రాహుల్ ఎంపీ పదవికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చినా, స్పీకర్ కార్యాలయం తన ఉత్తర్వులను వెనక్కు తీసుకోకపోవచ్చు!
గతంలో అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాలు, లోక్ సభ స్పీకర్ కార్యాలయాలు కోర్టు ఆదేశాలను పట్టించుకున్న దాఖలాలు కూడా పెద్దగా లేవు! ఫిరాయింపుదారుల విషయంలో పార్టీలు కోర్టులను ఆశ్రయించి సాధించింది ఏమీ లేదనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో కూడా లోక్ సభ స్పీకర్ కార్యాలయం తను అనుకున్నదే జరిగేలా చూడటంలో వింత ఉండకపోవచ్చు!