Advertisement

Advertisement


Home > Politics - National

పెళ్లి పీటలెక్కాలంటే గడ్డం తీసేయాల్సిందే..!

పెళ్లి పీటలెక్కాలంటే గడ్డం తీసేయాల్సిందే..!

మాసిన గడ్డం ఒకప్పుడు చిన్నతనం. ఇప్పుడది ట్రెండ్. క్లీన్ షేవ్ తో కనిపించారంటే, వారు ట్రెండ్ ని ఫాలో కానట్టే లెక్క. కాలేజీలో నో ఎంట్రీ అంటేనో, ఆఫీస్ లో బాస్ కోప్పడతాడనే కారణంతోనో కొంతమంది క్లీన్ షేవ్ చేస్తుంటారు. లేకపోతే ఈ రోజుల్లో గడ్డంతో కనిపించడమే మ్యాన్లీ లుక్ అనేది ఫిక్స్ అయిపోయింది.

అంతెందుకు ఇటీవల ఏ పెళ్లిలో అయినా పెళ్లి కొడుకు క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడేమో చూడండి. పేద, మధ్యతరగతి, ధనవంతుల ఇళ్లలో.. ఎక్కడ ఏ పెళ్లి జరిగినా పెళ్లి కొడుకు గడ్డంతో వచ్చి పీటలపై కూర్చుంటున్నాడు. అయితే ఇకపై ఇలాంటి వేషాలు కుదరవంటున్నారు రాజస్తాన్ లోని కొన్ని గ్రామాల పెద్దలు. గడ్డం ఉన్న పెళ్లి కొడుకులకు పీటలపై కూర్చునే అర్హత లేదని తేల్చి చెబుతున్నారు.

రాజస్థాన్‌ లోని సవాయి మాధోపూర్‌ గ్రామంలో మొదటగా ఈ కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. ఆ గ్రామంలో కుమావత్ సమాజ్ వర్గానికి చెందిన వారు ప్రతి ఏడాది సామూహిక వివాహాలు జరిపిస్తారు. ఈ ఏడాది మే 5న సామూహిక వివాహాలకు మహూర్తం ఫిక్స్ చేశారు. కొత్త జంటల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అయితే అక్కడే చిన్న మతలబు ఉంది.

పీటలపై కూర్చునే సమయంలో పెళ్లి కొడుకు గడ్డంతో వస్తే నో ఎంట్రీ అంటున్నారు. ఎంట్రీలు నమోదు చేసుకునే సమయంలోనే ఈ నిబంధన పక్కన సంతకం తీసుకుంటున్నారు.

కుమావత్ సమాజ్ పెద్దలు ఇటీవల గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ తీర్మానం చేశారు. పెళ్లికి వరుడు క్లీన్ షేవ్‌ లో మాత్రమే రావాలనే నిబంధన విధించారు. మాసిన గడ్డంతో వస్తే పెళ్లి పీటలు ఎక్కనిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ నిర్ణయానికి జైపూర్, టోంక్, సవాయి మాధోపూర్ ప్రాంతాల ప్రజలు మద్దతు తెలిపారు.

పెళ్లిలో అయినా కనీసం సంప్రదాయాలు పాటించాలని పెద్దలు చెబుతున్నారు. గడ్డం తమ సంప్రదాయం కాదని, కనీసం పెళ్లి కోసమైనా వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందేనంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?