Advertisement

Advertisement


Home > Politics - National

కేజ్రీవాల్, కేసీఆర్ లను ఒకే గాటన కడుతున్న కాంగ్రెస్!

కేజ్రీవాల్, కేసీఆర్ లను ఒకే గాటన కడుతున్న కాంగ్రెస్!

కేజ్రీవాల్ కు ఇప్పుడు కాంగ్రెస్ అవసరం ఉంది. ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశంలో ఉన్న బిజెపి వ్యతిరేక పార్టీలన్నింటి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు కేజ్రీవాల్. కాంగ్రెస్ పార్టీని కేజ్రీ నమ్ముతారా లేదా? మోడీ వ్యతిరేక జాతీయ కూటమికి కాంగ్రెస్ సారథ్యాన్ని అంగీకరిస్తారా? లేదా? అనే చర్చ తరువాత, ప్రస్తుతానికి ఆయన తనకు ఎదురైన కష్టానికి కాంగ్రెస్ మద్దతు కోరుతున్నారు. అయితే కేజ్రీకి మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉండడం విశేషం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయనను కాంగ్రెస్ నమ్మడం లేదు.

ఢిల్లీ సర్కారు నిర్ణయాధికారాలకు చెక్ పెడుతూ, అధికారుల బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నరుకు మార్చేస్తూ కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్డినెన్స్ సభామోదం కూడా పొందుతుంది. కానీ.. రాష్ట్రాల అధికారాలకు కేంద్రం కోత పెడుతోందనే అంశాన్ని దేశవ్యాప్తంగా యాగీ చేయడానికి రచ్చరచ్చ చేయడానికి కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. 

దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఆయన మద్దతు కోరుతున్నారు. తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను కూడా కలిసి వెళ్లారు. కాంగ్రెస్ అధినాయకులతో కూడా భేటీ అయ్యారు. అయితే కాంగ్రెస్ అంతర్గతంగా ఈ విషయంలో సీనియర్ నాయకుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు .. కేజ్రీవాల్ పట్ల అనుకూలత వ్యక్తం కాలేదని వార్తలు వస్తున్నాయి.

కేజ్రీవాల్ బిజెపికి బి-టీమ్ లాంటి వారని పలువురు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. కేజ్రీవాల్ పనిగట్టుకుని ఢిల్లీ, పంజాబ్ సహా పలుచోట్ల కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే బిజెపి వ్యూహంలో భాగంగా పనిచేశారనేది కాంగ్రెస్ సీనియర్ల అభిప్రాయం. 

గుజరాత్ లో పోటీచేసి బిజెపి గెలుపునకు కేజ్రీవాల్ ఉపయోగపడ్డారనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. అందుకే బిజెపి మీద పోరాటానికి మద్దతు కోరుతున్నప్పటికీ కూడా.. వారు ఆయనను బిజెపికి బిటీమ్ అనే అభివర్ణిస్తున్నారు.

తమాషా ఏంటంటే కాంగ్రెస్ దృష్టిలో కేసీఆర్ కు ఉన్న ఇమేజి కూడా ఇదే. భారాస- బిజెపికి బిటీమ్ గానే చూస్తున్నారు. కేసీఆర్ ప్రయత్నాలన్నీ బిజెపి వ్యతిరేక ఓటును చీల్చడానికి తప్ప, మరోసారి మోడీని ప్రధాని చేయడానికి మరొకందుకు ఉపయోగపడవనేది వారి అభిప్రాయం. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో.. తమ కూటమికి వారిని ఎలా రాబట్టుకుంటారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?