సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ… తాజాగా అధికారంపై ఆశ్చర్యపరిచే ప్రకటన చేసింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. తొమ్మిది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో సోమ, మంగళవారాల్లో 26 ఎన్డీయేతర పార్టీలు సమావేశమయ్యాయి.
ఇవాళ నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ప్రకటన చేశారు. ప్రధాని పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను కాపాడటమే తమ పార్టీ ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. సమావేశానికి హాజరైన 26 పార్టీలకు రాజకీయంగా తగిన బలం వుందన్నారు. సమావేశానికి వచ్చిన పార్టీల్లోని కొన్ని 11 రాష్ట్రాల్లో అధికారాన్ని చెలాయిస్తుండడాన్ని ఆయన గుర్తు చేశారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలను దక్కించుకుందన్నారు. అయితే ఇది బీజేపీ గెలుపు కాదన్నారు. అక్కడ బీజేపీ మిత్రపక్షాల ఓట్లను దక్కించుకుని, తాను అధికారంలోకి వచ్చిందని ఖర్గే చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షాలను వదిలేసిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశ వ్యాప్తంగా తిరుగుతూ పాత స్నేహితులతో స్నేహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రధాని పదవిపై ఆశ లేదని కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రకటనతో ఒక సమస్యకు పరిష్కారం లభించినట్టైంది. అయితే కాంగ్రెస్ పార్టీ తన మాటపై ఎంత వరకు నిలబడుతుందో చూడాలి. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను కలుపుకుని బీజేపీని ఓడించడానికి ఆ పార్టీ చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయో, లేదో కాలం జవాబు చెప్పాల్సి వుంది.