ఈ వాలంటైన్స్ డే రోజున సరికొత్త రికార్డ్ ఒకటి నమోదైంది. ముద్దు పెట్టుకోవడంలో ఓ జంట కొత్త రికార్డ్ నెలకొల్పింది. 13ఏళ్ల క్రితం ఉన్న రికార్డ్ ని సరిచేసింది. నాన్ స్టాప్ గా ఈ జంట 4 నిమిషాల 6 సెకన్ల పాటు ముద్దు పెట్టుకుంది. ఇందులో వింత ఏముందనుకుంటున్నారా.. వాళ్లు పెదవులు కలిపింది నీటి అడుగున మరి. ప్రాణాలకు తెగించి చేసిన ఈ సాహసం చేసిన ఈ జంట, దక్షిణాఫ్రికాకు చెందిన గజ ఈతగాళ్లైన భార్యాభర్తలు.
దక్షిణాఫ్రికాకు చెందిన బెత్ నీల్, కెనడాకు చెందిన మైల్స్ క్లోషర్ అనే ఇద్దరు ప్రొఫెషనల్ డైవర్స్ నీటి అడుగున సాహసాలు చేస్తుంటారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ దక్షిణాఫ్రికాలో సెటిలయ్యారు. వీరికో కుమార్తె కూడా ఉంది. అయితే ఎప్పటినుంచో వీరికి ముద్దులో ప్రపంచ రికార్డ్ సృష్టించాలని ఆశ. నీటి కింద ఎక్కువసేపు లిప్ కిస్ పెట్టుకున్న జంటగా గిన్నిస్ బుక్ ఎక్కాలని ప్రయత్నించారు.
13 ఏళ్ల క్రితం ఇటాలియన్ టీవీ షో లో ఓ జంట నీటి కింద అత్యథిక సమయం ముద్దు పెట్టుకుని రికార్డ్ సృష్టించింది. 3 నిమిషాల 24 సెకన్లపాటు వారు నీటి కింద లిప్ కిస్ లాగించారు. ఆ రికార్డ్ బ్రేక్ చేయడానికి నీల్ – మైల్స్ జోడీ చాలాసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ ఈ ఏడాది వాలంటైన్స్ డే కి వారిద్దరూ ఆ అరుదైన ఫీట్ సాధించారు. ఏకంగా 4 నిమిషాల 6 సెకన్ల పాటు స్విమ్మింగ్ పూల్ అడుగున లిప్ కిస్ పెట్టుకున్నారు.
ఉదయం 7.30 గంటలకు వారు ఈ రికార్డ్ ఫీట్ మొదలు పెట్టారు. గిన్నిస్ బుక్ సంస్థ ఈ ఫీట్ వీడియోని రికార్డ్ చేసింది. ఈత కొలను అడుగు భాగంలో కూర్చుని వీరిద్దరూ ముద్దు సీన్ స్టార్ట్ చేశారు. దీనికోసం మూడేళ్లుగా వీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. రికార్డ్ ఫీట్ ముందు కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ లో దిగారు.
అయితే ఇలాంటి ఫీట్లు నిపుణులు మాత్రమే చేయాలని చెబుతున్నారు నీల్-మైల్స్ జోడీ. కార్బన్ డై ఆక్సైడ్ లెవల్స్ శరీరంలో పెరిగిపోయే కొద్దీ గుండెపై ఒత్తిడి పెరుగుతుందని దాన్ని జయించే క్రమంలో సరైన టైమ్ లో శ్వాస తీసుకోవాల్సిందేనంటున్నారు. అలా శ్వాస తీసుకోకపోతే అది ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. రికార్డ్ కోసం చాలా సార్లు తాము దీన్ని ప్రాక్టీస్ చేశామని, చివరకు అనుకున్నది సాధించామని, ప్రపంచ రికార్డ్ ని తమ పేరిట నెలకొల్పామన్నారు.